చెన్నై, సాక్షి ప్రతినిధి: రవాణా సంస్థలో ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధనకోసం ప్రారంభించిన సమ్మె మంగళవారం మూడో రోజుకు చేరింది. అధికార, విపక్ష అనుబంధ సంఘాల మధ్య విభేదాలు తలెత్తడంతో సుమారు 40 శాతం బస్సులు రోడ్డెక్కాయి. జీతాల పెంపు, కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర 22 అంశాలపై ఈనెల 28న సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలోని 8 రవాణాశాఖ కార్పొరేషన్లకు చెందిన 1.42 లక్షల మంది సమ్మెలోకి దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు స్తంభించిపోయాయి.
మంగళవారం నాటికి బస్సుల సమ్మె మూడోరోజుకు చేరుకుంది. అధికార అన్నాడీఎంకే సంఘాలు విధుల్లో చేరడం వల్ల సుమారు 40 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అయితే అనేక చోట్ల బస్సుల రాకపోకలను విపక్ష పార్టీల అనుబంధ సంఘాల వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాస్తారోకో, రోడ్డుపై బైఠాయించి బస్సులు వెళ్లకుండా చేశారు. తిరుచ్చి, తంజావూరు, నాగైలో 285 మందిని, నెలై్ల, తూత్తుకూడి, కోవై, సేలం, వేలూరు, తిరువణ్నామలైలో 500 మందిని అరెస్ట్ చేశారు. నెల్లూరుకు వెళుతున్న బస్సుపై గుమ్మిడిపూండి సమీపంలో రాళ్లురువ్వగా అద్దాలు ధ్వంసమయ్యూరుు.
చెన్నైలో 624 మంది అరెస్ట్
నగరంలోని తిరువాన్మియూర్‌లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాల వారు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. తిరువొత్తియూరు రామంజేరి సమీపంలోనూ, అరక్కోణంలోనూ బస్సులపై రాళ్లురువ్వారు. ఆవడి, వ్యాసార్పాడి డిపోల నుండి బస్సులను బయటకు తీస్తుండగా అడ్డుకున్న వారిని అరెస్ట్ చేశారు. కోయంబేడు బస్‌స్టేషన్ ఫ్టాట్‌ఫాంపై నిలబడి నినాదాలు చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. రాస్తారోకో, డిపోల ఎదుట బైఠాయింపు, విధుల్లో చేరిన కార్మికులపై దాడులకు దిగడం, బస్సుల ధ్వంసం, ప్రయాణికులతో రోడ్లపై వెళుతున్న బస్సులను అడ్డుకోవడం తదితర నేరాలపై ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1200 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టుల్లో ప్రవేశపెట్టి జైళ్లకు తరలించారు.
పట్టుదలతో అధికార పార్టీ
రవాణా సమ్మెతో ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ వారి ఎత్తుగడను చిత్తు చేసేందుకు ఐదుగురు మంత్రులు మంగళవారం స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, టీకేఎమ్ చిన్నయ, బీవీ రమణ, అబ్దుల్ రహీం వేర్వేరుగా బస్సు డిపోల వద్ద సంచరించారు. అన్నాడీఎంకే సంఘాలకు భరోసా ఇస్తూ బస్సులు బయలుదేరకుండా అడ్డుకుంటున్నవారిని అరెస్ట్ చేయించారు. ఈ కారణంగా అనేక చోట్ల పెద్ద సంఖ్యలో బస్సులు తమ సేవలు అందించడం ప్రారంభించాయి.
తిరుత్తణి బస్‌డిపోలోకి అధికార పార్టీ నేతలు ప్రవేశించి సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేరాలంటూ బెదిరించారు. రాష్ట్రం మొత్తం మీద 70 శాతం బస్సులు నడుస్తున్నాయని అధికార పార్టీ చెబుతోంది. రవాణాశాఖ ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 100 శాతం డీఏను 107 శాతానికి పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెంచిన డీఏ ఈఏడాది జూలై నుంచి పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేసింది.
మూడో రోజూ సమ్మె
Published Wed, Dec 31 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement