
ఇదీ అసలు కథ
ముంబై : పటేళ్ల ఉద్యమం ద్వారా గుజరాత్ అసలు సంగతి బయటపడిందని శివసేన ఎద్దేవా చేసింది. గుజరాత్ రాష్ట్రం ఏ మేర అభివృద్ధి చేశారో పటేళ్ల ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతోందని దుయ్యబట్టింది. పటేళ్ల డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రంలో 2017లో భాజాపా గెలవదని హార్దిక్ పటేల్ హెచ్చరించడంతో గుజరాత్ రాజకీయాల్లో కలవరం మొదలైందని పేర్కొంది. ప్రధాని నరేంద్రమోదీ బహు ప్రజాదరణ పొందిన వ్యక్తి అని, కానీ ప్రస్తుతం హార్దిక్ పటేల్ ప్రజాదరణ పొందుతున్నారని పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది. గుజరాత్‌లో పటేళ్లు, రాష్ట్రంలో మరాఠాలు ఒక్కటే అని సేన అభిప్రాయపడింది. వ్యవసాయం, పరిశ్రమలు, సహకార బ్యాంకులు, రాజకీయాల్లో మరాఠాలు ముందున్నారని, అయితే తమను ఇతర వెనక బడిన తరగతి జాబితా (ఓబీసీ) లో చేర్చాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారని చెప్పింది.
కాగా, గుజరాత్‌లో పటేళ్ల వర్గం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉందని, ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు పటేల్ వర్గం వారేనని పేర్కొంది. డైమండ్ వ్యాపారం, నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాల్లో వారు ముందున్నారని వెల్లడించింది. అయినప్పటికీ గుజరాత్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్నారంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందనడం అబద్ధమని చెప్పింది. గుజరాత్ శాంతియుతంగా, క్రమశిక్షణతో ఉంది కాబట్టి ముంబై నుంచి పరిశ్రమలు అక్కడకు తరలి వెళ్తాయని సీఎం పటేల్ అనుకుంటున్నారని, ఈ మాట్లల్లో వాస్తవం లేదని హర్దిక్ ఉద్యమం ద్వారా అర్థమవుతోందని పేర్కొంది.