మీరాకుమారి నివేదికపై ఆగ్రహం
దేశ రాజధానికి బయల్దేరిన జాలర్ల సంఘాల నాయకులు
నిషేధ కాలానికి జీవన భృతిగా రూ.33 కోట్లు కేటాయింపు
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరంలో ఉన్నాయి. ఇక్కడి జాలర్లకు చేపల వేట తప్ప మరో వృత్తి తెలియదు. ఓ వైపు తమ మీద శ్రీలంక సేనలు దాడులు చేస్తున్నా, మరో వైపు బతుకు తెరువు కోసం కడలిలోకి వెళ్లక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్రం నియమించిన డాక్టర్ మీరా కుమారి కమిటీ నివేదిక జాలర్లకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. శ్రీలంక సేనల రూపంలో నడి సముద్రంలో చేపల వేట గ గనం అవుతున్న తరుణంలో, చేపల వేటను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసే విధంగా నివేదికలో పొందు పరిచిన అంశాలు జాలర్లలో ఆగ్రహాన్ని రేపా యి.
చేపల వేట జాలర్లకు మాత్రమే సాధ్యమైనా, ఇక, విదేశాల తరహా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించే విధంగా కొత్త నిబంధనల అమలుకు కేంద్రం యోచిస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించారు. నిషేధ కాలం పొడిగింపు, కొత్తగా పర్మిట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం తదితర అంశాలను వ్యతిరేకిస్తూ, మీరా కుమారి నివేదికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరు బాటకు జాలర్లు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఛలో ఢిల్లీ నినాదంతో పార్లమెంట్ ముట్టడికి తమిళ జాలర్లతో పాటుగా పలు రాష్ట్రాల్లోని సముద్ర తీర జాలర్ల సంఘాలు పిలుపు నిచ్చాయి.
ఛలో ఢిల్లీ : బుధవారం పార్లమెంట్ ముట్టడి లక్ష్యంగా జాలర్ల సమాఖ్యా ఇచ్చిన పిలుపుకు రాష్ట్రంలోని జాలర్లు కదిలారు. ఇప్పటికే కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర జాలర్ల సంఘాల నాయకులు తమ నిరసనను తెలియజేయడం కోసం ఛలో ఢిల్లీ అంటూ పయనం అయ్యారు. జాతీయ జాలర్ల సమాఖ్య నాయకుడు ఇలంగో నేతృత్వంలో తమిళనాడు నుంచి బృందాలు కదిలాయి. నాగపట్నం జాలర్ల సంఘం నాయకుడు తిరునల సెల్వన్ నేతృత్వంలో పన్నెండు మంది, కారైక్కాల్ నేత వీర దాసు నేతృత్వంలో 22 మంది, పుదుకోట్టై నేత కుట్టియాండి నేతృత్వంలో 25 మంది, కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాధపురం తదితర జిల్లాలకు చెందిన మొత్తం 250 మందికి పైగా జాలర్ల ప్రతినిధులు తమ తమ ప్రాంతాల నుంచి రైలు మార్గంలో సోమవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.
ఈ విషయంగా ఇలంగో పేర్కొంటూ, మీరా కుమారి నివేదిక జాలర్ల జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి సముద్రంలో చేపల వేటను అతి పెద్ద సంస్థలకు అప్పగించే విధంగా 270 నౌకలకు అనుమతి ఇవ్వబోతున్నారని, ఇందులో భాగంగానే కొత్తగా పర్మిట్ల కేటాయింపును ఆ నివేదికలో పొందు పరిచి ఉన్నారని ఆరోపించారు. నౌకల ద్వారా చేపల వేటకు అతి పెద్ద సంస్థలు రంగంలోకి దిగిన పక్షంలో, జాలర్ల చేతికి చిన్న చేప కూడా చిక్కడం అనుమానమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ నిరసనను తెలియజేయడానికి ఢిల్లీకి బయలు దేరామన్నారు.
రూ. 33 కోట్లు : జాలర్ల సంఘాల నాయకులు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని వెల్లగక్కేందుకు ఢిల్లీకి పయనం అయితే, రాష్ట్ర ప్రభుత్వం జాలర్లను ఆదుకునే విధంగా నిషేద కాలంలో జీవన భృతి కోసం రూ. 33 కోట్లను ప్రకటించింది. ఈ మేరకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలతో అధికారులు ప్రకటించారు. గత ఏడాది లక్షా 49 వేల 855 జాలర్ల కుటుంబాలకు జీవన భృతి క ల్పించగా, ఈ ఏడాది మరో పది శాతం కుటుంబాలు పెరిగాయి. నిషేద కాలం 45 రోజులా లేదా 65 రోజులా అన్నది ఇంకా స్పష్టతకు రానప్పటికి, ముందస్తుగా జాలర్లను అదుకునేందుకు ఈ నిధుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది లక్షా 65 వేల కుటుంబాల మేరకు జీవన భృతి దక్కే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
చలో ఢిల్లీ
Published Tue, Apr 21 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement
Advertisement