పుణే : నగరంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించుకోవాలని యోచిస్తోంది. ‘సాధారణంగా మన వాడుక నీటిలో 69 శాతం గ్రే వాటర్, 31 శాతం బ్లాక్ వాటర్ ఉంటాయి. బ్లాక్ వాటర్ నుంచి మురుగు నీరును వేరుచేసి శుద్ధి చేయగలిగితే శుద్ధి చేసేందుకు అయ్యే వ్యయాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు’ అని పీఎంసీ కార్పొరేటర్లు, అధికారులు అంటున్నారు.
నగరంలోని 67వ వార్డు (సహకర్‌నగర్) కార్పొరేటర్ అబా బాగుల్ మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు గల ఆవశ్యకతను కార్పొరేషన్ అధికారులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘వంటగదిలో, షవర్లు, వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా మురుగు నీరు వస్తుంది. నివాస గృహాల్లో వినియోగం వల్ల విడుదలైన నీటిలో 50 -80 శాతం వ్యవసాయానికి, మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ‘మరుగుదొడ్లలో మురుగు నీరును తిరిగి వినియోగించుకునేందుకు అదనపు పైపులు, పంపులు, నిల్వ ట్యాంకు, శుద్ధి కేంద్రం ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని..’ అని వారు చెప్పారు.
‘మురుగు నీరు పునర్వినియోగ కేంద్రం ఏర్పాటుకు పీఎంసీ చాలా ఉత్సాహంగా ఉంది. ఒకసారి 67వ వార్డులో దీన్ని ఏర్పాటుచేసిన తర్వాత, నగరంలోని మిగిలిన వార్డుల్లో కూడా ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటుకు స్థానికులు ముందుకు వస్తారనే నమ్మకం ఉంది..’ అని కార్పొరేటర్ బాగుల్ చెప్పారు. నీటి పునర్వినియోగ కేంద్రాల ఏర్పాటు వల్ల నగరంలో నీటి సమస్య కొంతవరకు తీరవచ్చన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇదే సరైన మార్గమన్నారు. మొక్కల పెంపకం, కార్లు కడగడానికి తదితర పనులకు మంచినీటికి బదులు ఈ నీటిని వాడుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిసమస్యను ఎదుర్కొనేందుకు మురుగు నీరు పునర్వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీఎంసీ అధికారులు చెబుతున్నారు.
జల శుద్ధీకరణ కేంద్రానికి నిధులు
పుణే: రూ. 12 కోట్ల విలువైన వద్గావ్ జల శుద్ధీకరణ ప్రాజెక్టు నిర్మాణానికి పుణే మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్థాయీ సమితి రూ. 11 కోట్లు మంజూరు చేసింది. 125 ఎంఎల్‌డీ నీటిని శుద్ధిచేయగల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ సాయంతో కార్పొరేషన్ నిర్మించనుంది.
నీటిబొట్టు.. ఒడిసి పట్టు!
Published Fri, Dec 27 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement