నేడు బడ్జెట్
Published Thu, Feb 13 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
సాక్షి, చెన్నై: 2014-15కు గాను రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో దాఖలు చేయడానికి ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలపై వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభకు ఎన్నికల నగారా నెలాఖరులో మోగే అవకాశాలు కన్పిస్తుండటంతో రాష్ట్ర బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాకర్షణే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడంతో పాటుగా ఉచిత పథకాలకు నిధుల వరద, అమ్మ క్యాంటీన్ల విస్తరణ, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధుల కేటాయింపుతో పాటుగా సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టేందుకు బడ్జెట్‌ను వేదిక చేసుకున్నట్టు సమాచారం.
అధికార యంత్రాంగం, మంత్రులు రేయింబవళ్లు శ్రమించి ప్రజాకర్షక బడ్జెట్‌ను సిద్ధం చేసినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.సమీక్ష: బడ్జెట్‌లో కేటాయింపులపై అధికార యంత్రాంగంతో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. ఇక బడ్జెట్ దాఖలుకు మరి కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అందులో పేర్కొన్న అంశాలకు తుది మెరుగులు దిద్దేందుకు బుధవారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ అయింది. సీఎం జయలలిత నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి మంత్రులందరూ హాజరయ్యారు. శాఖల వారీగా జరిగిన కేటాయింపులు, పథకాల గురించి చర్చించారు. చిన్న చిన్న మార్పులు చేసినా, చిట్ట చివరగా సరికొత్త పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వాటిని గురువారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ద్వారా అసెంబ్లీలో ప్రకటించేందుకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు.
సేవా పన్ను: కేబినెట్ సమావేశానికి ముందుగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. బియ్యానికి సేవా పన్ను విధించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తన లేఖ ద్వారా జయలలిత తప్పుబట్టారు. బియ్యం వ్యవసాయ ఉత్పత్తి కాదంటూ ఆర్థిక శాఖ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తమిళనాడులో ఉచిత బియ్యం పథకం అమల్లో ఉందని గుర్తు చేశారు. బియ్యంపై సేవా పన్ను విధించిన పక్షంలో ధరలు అమాంతంగా పెరగడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలతో చర్చించకుండా ఆర్థిక శాఖ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సేవా పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ఆ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మింట్ వంతెన: సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత మింట్ వంతెనను ప్రారంభించారు. ఉత్తర చెన్నైలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విధంగా మింట్‌లో రూ.23 కోట్ల వ్యయంతో భారీ వంతెన నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్నా, ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ఉదయం ఈ వంతెనను ఉత్తర చెన్నైవాసులకు అంకితం చేశారు. ఈ వంతెనతో పాటుగా స్టాన్లీ ఆస్పత్రి వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన సబ్ వే, షెనాయ్ నగర్‌లో రూ.18 కోట్లతో నిర్మించిన ఆడిటోరియంలను కూడా జయలలిత ప్రారంభించారు. సంక్షేమ పథకాల పంపిణీ, ఉద్యోగ నియూమకాలు, మరి కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Advertisement
Advertisement