రణ రంగం
- ‘దేవనహళ్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత
- టోల్ చార్జీల పెంపునకు నిరసన
- బీజేపీ, కర్ణాటక రక్షణా వేదిక ఆందోళన
- భారీ స్థాయిలో పోలీసుల మోహరింపు
- అధికారులతో మంత్రి మహదేవప్ప భేటీ
- ఇది బీజేపీ తప్పిదమని విమర్శ
- టోల్ చార్జి తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో టోల్‌ను ఉన్నఫళంగా రెండున్నర రెట్లు పెంచినందుకు నిరసనగా మంగళవారం పలు సంఘాలు, పార్టీలు అక్కడ చేపట్టిన ఆందోళనతో ఆ ప్రాంతం రణ రంగంగా మారింది. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ కొన్ని సంఘాల కార్యకర్తలతో ఘర్షణ పడాల్సి వచ్చింది.
బీజేపీకి చెందిన మాజీ మంత్రులు ఆర్. అశోక్, బీఎన్. బచ్చేగౌడ, యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రభృతులు ఆందోళనకు నాయకత్వం వహించారు. మరో వైపు కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ నాయకత్వంలో ఆందోళన జరిగింది.
అధికారులతో మంత్రి చర్చలు
టోల్ పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన సాగుతుండడంతో ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప అధికారులతో సమావేశమై చర్చించారు. టోల్‌ను తగ్గించడం సాధ్యమవుతుందా అని ఆరా తీశారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ టోల్ పెంపుపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. సదానంద గౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి వర్గ సమావేశంలో టోల్ ధరను నిర్ణయించారని వెల్లడించారు.
టోల్ పెంపు వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై సోమవారం ఢిల్లీలో తాను జాతీయ రహదారుల ప్రాధికార అధికారులతో చర్చించానని తెలిపారు. స్థానికులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టోల్ తగ్గింపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కొందరు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
జాతీయ రహదారులు
రాష్ట్రంలోని 2,108 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసిందని మంత్రి తెలిపారు. మొత్తం ఏడు రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నారని, దీనికి రూ.10 వేల కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. సుమారు 65 ఏళ్ల తర్వాత తొలి సారిగా ఇంత పెద్ద ఎత్తున జాతీయ రహదారులుగా మార్చనున్నారని వెల్లడించారు.