కెప్టెన్‌తో ట్రాఫిక్ భేటీ
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌తో మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షుడు ట్రాఫిక్ రామస్వామి గురువారం సమావేశమయ్యారు. చెన్నై కోయంబేడులోగల డీఎండీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది. వారిరువురూ సుమారు 50 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఇందులో కోశాధికారి ఏఆర్ ఇలంగోవన్, యువజన సంఘం కార్యదర్శి ఎల్‌కే సుధీష్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు.
అనంతరం విలేకరులతో ట్రాఫిక్ రామస్వామి మాట్లాడుతూ డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆహ్వానం మేరకు ఆయన్ను కలుసుకున్నానని, తాను రూపొందించిన 14 అంశాల గురించి ఇందులో ప్రస్తావించానన్నారు. ఇందులో ప్రాథమిక జీవనాధార వసతులు, హద్దు మీరి ప్రవర్తించేవారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం, ఉచిత విద్య తదితర అంశాలను ఆయనకు సమర్పించానన్నారు. తన ప్రయత్నాలకు డీఎండీకే అధ్యక్షుడు వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరితో పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై కూడా చర్చించామని, వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద మార్పు ఏర్పడుతుందన్నారు. కాంచీపురం జిల్లాలో వచ్చే 20వ తేదీ జరిగే డీఎండీకే మహానాడు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకురానుందన్నారు.