హత విధీ... | train accident in Anantapur district | Sakshi
Sakshi News home page

హత విధీ...

Published Tue, Aug 25 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

హత విధీ...

హత విధీ...

అనంతపురం జిల్లాలో రైలు ప్రమాదం
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ
ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ సహా    ఐదుగురి దుర్మరణం పలువురికి గాయాలు

 
 బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్... సోమవారం... తెల్లవారుజామున 2.27 గంటలు... ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. రైలు 40 మైళ్ల వేగంతో ముందుకు వెళుతోంది. ఒక్కసారిగా భయకరమైన శబ్ధం.. వెనువెంటనే 25 టన్నుల బరువైన రాయి బోగిలోకి దూసుకువచ్చింది.ఐదుగురి ప్రాణాలను బలిగొంది.
 
బెంగళూరు:   ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద రైల్వే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెరె వెంకటేష్‌నాయక్  సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వివరాలు... నాందేడ్ వెళ్లే  ఎక్స్‌ప్రెస్(16594) రైలు ఆదివారం రాత్రి 10:30 గంటలకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్  నుంచి బయలు దేరింది. సోమవారం వేకువజామున 2:30 గంటలకు రైలు 132-200/300  కిలోమీటరు వద్ద(పెనుగొండ రైల్వేస్టేషన్ సమీపంలో) లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా గ్రానైట్ రాళ్లతో కూడిన టారస్ లారీ వేగంగా వచ్చి రైల్వే గేట్‌ను ఢీకొని రైలును బలంగా తాకింది. దీంతో లారీలోని గ్రానైట్ రాళ్లు ఎగిరి మొదటి తరగతి ఏసీ కోచ్ (హెచ్-1)పై పడ్డాయి. ఫలితంగా కోచ్ నుజ్జునుజ్జైంది. ఈ బండరాళ్ల కింద పడి హెచ్-1 కోచ్‌లోని కూపే ఈ, డీలలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే  అరికెర వెంకటేష్ నాయక్ (79), టీఎస్‌డీ రాజు (53), కాబిన్ ఎఫ్‌లో ఉన్న ఈదర పుల్లారావు(48)లతో పాటు ఏసీ కోచ్ మెకానిక్‌గా విధుల్లో ఉన్న సయ్యద్ అహ్మద్ (52), టారస్ లారీ క్లీనర్ నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

లారీలోని బండరాళ్లు ఎగిరిపడటంతో హెచ్1తోపాటు బీ-1, ఎస్-1, ఎస్-2 కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో ఈ కోచ్‌ల్లో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖలోని వైద్య విభాగం అధికారులు అక్కడికక్కడే చికిత్స అందించారు. మరోవైపు గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న జగదీష్, శాంతి, సురేష్‌లను బెంగళూరులోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గేటు వేసే ఉంది...
ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేటు (నం:77) వేసే ఉందని బెంగళూరు రైల్వే డివిజన్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రెడ్‌లైట్ వెలుగుతూ ఉండటమే కాకుండా సైరన్ కూడా మోగుతోందని అందులో తెలిపింది. లారీ వేగానికి రైల్వే గేటు కూడా విరిగిపోయిందని రైల్వేశాఖ పేర్కొంది.

20 ప్రత్యేక బస్సులు....
 ప్రమాదం తెలిసిన వెంటనే బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  వీరితో పాటు బెంగళూరు, గుంతకల్ నుంచి  మెడికల్ రిలీఫ్ వ్యాన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లులో వైద్య, పారా మెడికల్ సిబ్బంది  సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం అందించారు. మరోవైపు ప్రమాదానికి గురైన రైలులోని మిగిలిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి రైల్వే శాఖ 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు, స్నేహితులకు సమాచారం అందించడానికి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

 సంతాపం వ్యక్తం చేసిన సిద్ధు
 రైలు ప్రమాదంలో దేవదుర్గ శాసనసభ్యుడు అరికెర వెంకటేష్‌నాయక్ చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతి సౌమ్య మనస్కుడిగా గుర్తింపు పొందిన వెంకటేష్ నాయక్ మరణం పార్టీకు తీరనిలోటని పేర్కొన్నారు. మహదాయి నదీ నీటి పంపకం విషయమై జరిగిన అఖిల పక్షం సమావేశానికి హాజరైన వెంకటేష్ నాయక్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తనను కలిచివేస్తోందని సోమవారం సాయంత్రం  మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాజీ సీఎం ధరంసింగ్ కూడా వెంకటేష్ నాయక్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

 రెండు రైళ్ల సర్వీసులు రద్దు
 దుర్ఘటన వల్ల హిందూపూర్-గుంతకల్ ప్యాసింజర్ (57438), బెంగళూరు కంటోన్మెంట్-విజయవాడ ప్యాసింజర్ (56503) రైల్వే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిం చారు. హెల్ప్‌లైన్‌నం:080-23339162, 22354108,22156554, 08023339163,09701374062,09493548005,9731666751,09448090399
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement