ప్రమాదాలపై కమిషన్లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్ కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు.
విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు.