మైసూరుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మరోసారి మకాం మార్చారు. నిన్న ఉదయం తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలుసుకున్న తరువాత మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రే వారిని మైసూరుకు పంపించేశారు.
ఈనెల 12న ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పుదుచ్చేరి నుంచి మైసూరులోని గుడగుమలై లగ్జరీ రిసార్టుకు మకాం మార్చారు. ఇదిలా ఉండగా, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలంతా ఈనెల 14వ తేదీన తనను నేరుగా కలవాలని స్పీకర్ ధనపాల్ శుక్రవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అధికార అన్నాడీఎంకే పార్టీలో గొడవలు శ్రుతి మించాయి. ఇప్పటివరకు నాయకుల మధ్య మాటల యుద్ధం జరగగా ఇప్పుడు ఏకంగా కొట్లాటకు దిగారు. మధురైలో పన్నీరుసెల్వం, దినకరన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. మధురై విమానాశ్రయంలో ఇరు వర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కలబడ్డాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు.