తొందరపడొద్దు: శివసేన నాయకులతో ఉద్ధవ్
సాక్షి, ముంబై: అధికారం కోసం శివసేన తమ ఎదుట మోకరిల్లుతుందని బీజేపీ భావిస్తే అది భ్రమే అవుతుందని శివసేన నాయకులు స్పష్టం చేశారు. మాతోశ్రీ బంగ్లాలో గురువారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారం కోసం అనవసరంగా తొందరపడకూడదని ఉద్ధవ్ చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నవంబర్ ఒకటో తేదీన బాంద్రాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గీయుల ద్వారా తెలిసింది.
బీజేపీతో పాత అనుంబంధాన్ని కొనసాగించే విషయంపై శివసేనలో పాత ఎమ్మెల్యేలు జతకట్టాలని చెబుతుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా రెండు వేర్వేరు వర్గాల అభిప్రాయాలపై ఉద్దవ్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి నుంచి తమపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని కొందరు సేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా శివసేన పొత్తుపై బీజేపీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శివసేన నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఓం మాథూర్ చెప్పగా, ఆ పార్టీతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని రాజీవ్ రూఢీచెప్పడం గమనార్హం. శివసేనకు రెండు క్యాబినెట్, కొన్ని సహాయ మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని పార్టీ వర్గీయుల ద్వారా తెలిసింది.