ప్రచారహోరు
Published Mon, Nov 11 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
సాక్షి, చెన్నై:సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికను అన్నాడీఎంకే, డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డీఎంకే అభ్యర్థిగా మారన్, అన్నాడీఎంకే తరపున సరోజ పెరుమాల్ పోటీకి దిగారు. ఈ ఇద్దరూ నియోజకవర్గానికి కొత్త ముఖాలే. మారన్ స్థానికంగా ధనబలం, బంధుగణం మద్దతు కలిగిన యువ నాయకుడు. ఇక సరోజ దివంగత మాజీ ఎమ్మెల్యే పెరుమాల్ సతీమణి. రాజకీయ పరిజ్ఞానం ఉన్నా ప్రజల్లోకి ఆమె వెళ్లిన సందర్భాలు అరుదే. డీఎండీకే, పీఎంకే, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న మారన్ బంధుగణం రంగంలోకి దిగింది. ఒక్క అవకాశం అంటూ మారన్ ప్రచారంలో అమాయకపు ముఖంతో ఓటర్లను అభ్యర్థిస్తూ ఆకర్షిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా మారన్ గెలుపు కోసం ఆయన బంధుగణం శ్రమిస్తుండడం అన్నాడీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తొలుత తమ గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన అన్నాడీఎంకే ప్రస్తు తం జంబో జట్టునే రంగంలోకి దించింది. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, విద్యుత్‌శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, కేబినెట్‌లోని సగానికిపైగా మంత్రులు ఏర్కాడులో తిష్ట వేశారు. సరోజ విజ యమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తన భర్త వదలి పెట్టి వెళ్లిన పనుల్ని పూర్తి చేయడం లక్ష్యంగా ఓ అవకాశం ఇవ్వాలని కన్నీటితో
ఓటర్లను సరోజ అభ్యర్థిస్తుండడం గమనార్హం.
అద్దె ఇళ్లకు గిరాకీ
ఉప ఎన్నిక నేపథ్యంలో ఏర్కాడులో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. మంత్రులు, నేతల కోసం ఏర్కాడులోని హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్స్ ముందుగానే రిజర్వు అయ్యాయి. అయితే ఈ ఖర్చులన్నీ అభ్యర్థుల ఖాతాలో జమ చేయాడానికి ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. దీంతో వాటి పక్కకు వెళ్లకుండా అద్దె ఇళ్లను, బంగళాలను బుక్ చేసుకునే పనిలో నాయకులు పడ్డారు. దీంతో వాలంపాడి, పోత్త నాయకం పాలెం, ఏత్తాపూర్, ఆత్తూరుల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. నెలకు రెండు వేలూ అద్దె రాని ఇళ్లు ప్రస్తుతం రూ.20 వేల వరకు పలుకుతుండడం గమనార్హం. మొత్తం మీద ఉప ఎన్నిక కారణంగా ఏర్కాడు నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement