నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని
తమిళ చిత్రాలపై దృష్టి సారించినట్లున్నారు నటి విద్యాబాలన్. బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ బెంగళూరు భామ తమిళంలో చివరగా గురు చిత్రంలో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ప్రధాన నాయకి ఐశ్వర్యారాయ్. కాగా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్ర నిర్మాతతో విభేదాల కారణంగా తప్పుకున్నారు. దీంతో తమిళ చిత్రాలపైనే కోపం పెంచుకున్న విద్యాబాలన్ హిందీ, మలయాళ చిత్రాలకే పరిమితం అయిపోయారు.
అలాంటిది తాజాగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం హిందీలో అవకాశాలు తగ్గడమే కారణమా? ఇందుకు ఆమె ఏం చెబుతున్నారో చూద్దాం. నా ఆలోచనలు చిన్నతనంలో చెన్నైలో గడిపిన రోజులు వైపు మల్లుతున్నాయి. నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని. ఒకసారి ఆయన్ని కలవడానికి కమల్ ఇంటికితీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు. అయితే ఆయన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫొటో నాకు లభించింది. అప్పట్లో అదే పెద్ద థ్రిల్లింగ్ కలిగించిన విషయం.
తమిళ చిత్రాలకు దూరం అయ్యారేంటి? అని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళ, మలయాళం నాకు మాతృభాషలాంటివి. మంచి స్క్రిప్ట్ దొరికితే తమిళంలో నటించడానికి ఎప్పుడు సిద్ధమే. గత 2008 నుంచి నేను చిత్రాలను తగ్గించుకుంటున్నాను. ఏడాదికి ఒక్క చిత్రంలోనే నటిస్తున్నాను. షూటింగ్ ప్రాంతాలకు దూరంగా బాహ్య జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంటున్నారు నటి విద్యాబాలన్.