భారతీయ జనతా పార్టీపై గంపెడాశలు పెట్టుకున్న కూటమి నేతలు భంగపాటుకు గురవడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఆశించిన విజయకాంత్, అన్బుమణి రాందాస్
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీపై గంపెడాశలు పెట్టుకున్న కూటమి నేతలు భంగపాటుకు గురవడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఆశించిన విజయకాంత్, అన్బుమణి రాందాస్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లిందనే చర్చమొదలైంది. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించడం ఖాయమని, అయినా మిత్రపక్షాలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు ఉంటుందని ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ పదేపదే ప్రస్తావించారు. దీంతో మిత్రపక్షాల్లో ఉత్సాహం ఉరకలేసింది. మోడీ చెప్పినట్లుగానే బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించగా, తమకు ఏదోఒక పదవి ఖాయమని డీఎండీకే అధినేత విజయకాంత్ భావించారు.
ఢిల్లీ పెద్దలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మోడీ ప్రమాణస్వీకార సభకు ముందురోజే సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌లతో డిల్లీకి చేరుకున్నారు. పొత్తు చర్చల సమయంలోనే సుదీష్‌కు కేంద్రమంత్రి పదవి లేదా రాజ్యసభ సభ్వత్వం ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎంతకూ మోడీ నుంచి పిలుపు రాకపోవడంతో ముగ్గురూ హోటల్‌కే పరిమితమయ్యూరు. తరువాత జరిగిన ప్రమాణస్వీకార సభకూ హాజరుకాలేదు.పీఎంకేకు నిరాశే రాష్ట్రంలో బీజేపీ కూటమి నుచి విజేతగా నిలిచిన ఏకైక అభ్యర్థి అన్బుమణి రాందాస్ (పీఎంకే) యూపీఏ 1లో ఆరోగ్యశాఖా మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ కారణంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి తనకు మంత్రి పదవి ఖాయమని అన్బుమణి ఆశించారు. అయితే ఆయనకూ చోటు దక్కలేదు. కేబినెట్ కాదు కనీసం సహాయ మంత్రికీ నోచుకోలేదని విజయకాంత్, అన్బుమణి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విస్తరణలో పొన్‌కు కేబినెట్
కన్యాకుమారి నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు సహాయ మంత్రి పదవి దక్కడం కూడా విమర్శలకు తావిచ్చింది. 1999లో వాజ్‌పేయి కేబినెట్‌లో యువజన సంక్షేమం, దారిద్య్ర నిర్మూలన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈ సారి కేబినెట్ హాదా దక్కుతుందని ఆశించినా, మళ్లీ సహాయ మంత్రిగా సరిపెట్టుకోవడంపై బీజేపీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. తక్కువ మంత్రులు ఎక్కువ సామర్ద్యం అనే నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న మోడీ రానున్న రోజుల్లో పొన్‌కు కేబినెట్ పదవినిస్తారని పార్టీ సీనియర్ నేత చెబుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తమిళనాడుకు చెందిన పార్టీ ప్రముఖులు సోమవారం రాత్రి పొన్ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలోని ఒక హోటల్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్‌తోపాటూ మిత్రపక్షాలైన పీఎంకే, ఐజేకే తదితర మిత్రపక్ష పార్టీ నేతలు హాజరయ్యూరు. సుమారు గంటపాటూ వారితో గడిపిన పొన్‌రాధాకృష్ణన్ వారిలోని అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.
కేంద్ర కేబినెట్‌లో తమిళులు
తమిళనాడు నుంచి వివిధ పార్టీల తరపున గతంలో కేంద్ర కేబినెట్‌లో పలువురు మంత్రి పదవులు పొందారు. కాంగ్రెస్ తరపున రాజాజీ, సుబ్బరాయన్, వెంకట్రామన్, సీ సుబ్రమణియన్, మోహన కుమారమంగళం, పీ చిదంబరం, జీకే వాసన్, అరుణాచలం, మణిశంకర్ అయ్యర్ ఉన్నారు. తమిళనాడు రాజీవ్ కాంగ్రెస్ వాళపాడి రామమూర్తి, అన్నాడీఎంకే నుంచి తంబిదురై, సేడపట్టి ముత్తయ్య, డీఎంకే నుంచి మురసొలి మారన్, టీజీ వెంకట్రామన్, టీఆర్ బాలు, దయానిధి మారన్, రాజా, అళగిరి, పీఎంకే తరపున అన్బుమణి, బీజేపీ నుంచి రంగరాజన్ కుమారమంగళం కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.