ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ నందగోపాల్ అన్నారు. వాలాజ సమీపంలోని వేలం గ్రామ పంచాయతీలో అమ్మ పథకం కింద లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వేలూరు, న్యూస్‌లైన్:
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ నందగోపాల్ అన్నారు. వాలాజ సమీపంలోని వేలం గ్రామ పంచాయతీలో అమ్మ పథకం కింద లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో అమ్మ పథకం కింద పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. వాటిని అర్హులైన వారికి అందజేయడంలో అధికారులు అలసత్వం వహించరాదన్నారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో పలు పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. అనంతరం 33 మంది లబ్ధిదారులకు చెక్కులను కలెక్టర్ అందజేశారు.
గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించి కార్డుదారులకు సక్రమంగా బియ్యం, పప్పు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు సక్రమంగా అందజేస్తున్నారా లేదా అని కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులను ఇతర రాష్ట్రాలకు తరలకుండా చూడాలన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా కార్డుదారుల సంతకం తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో ప్రియదర్శిని, తహశీల్దార్ రాజేంద్రన్, ప్రత్యేక తహశీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు సత్యమూర్తి, సత్య, గ్రామ సర్పంచ్ కుమరేషన్, అధికారులు పాల్గొన్నారు.