► పోయెస్ గార్డెన్ నుంచి వెనక్కు రప్పించండి
► డీజీపీకి స్టాలిన్ లేఖాస్త్రం
సాక్షి, చెన్నై : ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్గిన రాజకీయ పార్టీ నేత అక్కడున్నారా...? లేదా కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ ఉన్నత పదవిలో ఉన్న వాళ్లు మరెవ్వరైనా అక్కడున్నారా?, ఎం దుకు అంత భద్రత అక్కడ అని రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ ను ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. పోయెస్ గార్డెన్ లో ఉన్న కోర్ సెల్ సీఐడీ భద్రతను వెనక్కు రపించాలని డిమాండ్ చేశారు. అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటాయి. ప్రత్యేక చెక్ పోస్టులతోపాటు, నిత్యం వాహనాల తనిఖీలు సాగేవి. అమ్మ జయలలిత అందర్నీ వీడి ఇరవై రోజులు కావస్తోంది. అమ్మకు మరణంతో ఆమెకు కల్పించిన జెడ్ ప్లస్ భద్రత మరుసటి రోజే ఉపసంహరించారు.
ఈ బృందం పోయెస్ గార్డన్ ను వీడింది. అయితే, కోర్ సెల్ సీఐడీ భద్రత మాత్రం అక్కడ నేటికీ కొనసాగుతుండడం చర్చకు దారి తీసింది. అలాగే, పోయెస్ గార్డెన్ పరిసరాల్లో నగర పోలీసు యంత్రాంగం నేతృత్వంలో భద్రత కొనసాగుతూనే ఉంది. కోర్ సెల్ సీఐడీ విభాగానికి చెందిన 240 మంది పోయెస్ గార్డెన్ లో నేటికీ భద్రతా విధుల్లో ఉన్నారు. శిక్షణ పొందిన ఎస్‌పీ స్థాయి అధికారి ఒకరు, నలుగురు డీఎస్పీలు, ఐదుగురు ఏడీఎస్పీలు, ఏడుగురు ఇన్డ స్పెక్టర్లు, మరో ఏడుగురు సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదా కల్గిన మిగిలిన సిబ్బంది చిన్నమ్మ శశికళ వెన్నంటి భద్రతా విధుల్లో ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మను పరామర్శించేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఈ సీఐడీ భద్రతా సేవలు అక్కడే కొనసాగుతుండడం వివాదానికి దారి తీసింది. వీరి బస కోసం పోయెస్ గార్డెన్ కు ఎదురుగా ఉన్న ఓ భవనాన్ని తీసుకుని ఉన్నారు.
బోట్ క్లబ్ ఆవరణలోని కమాండో ఫోర్స్ ప్రధాన కార్యాలయం మెస్ నుంచి వీరికి అన్నీ సరఫరా నేటీకి అవుతుండడంతో, ప్రజా ధనం ఎవరి కోసం...అక్కడెవ్వరున్నారని ఈ భద్రత అని పెదవి విప్పే పనిలో ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ నిమగ్నం కావడంతో , వెనక్కు రప్పించే ప్రయత్నాల్లో డీజీపీ చర్యలు తీసుకుంటారా అన్న ది వేచి చూడాల్సిందే. ఈ మేరకు శనివారం డీజీపీ రాజేంద్రన్ కు స్టాలిన్ లేఖాస్త్రం సంధించారు.
ఎవరున్నారని అక్కడ భద్రత: ఎన్నికల యంత్రాంగం గుర్తింపు కల్గిన పార్టీ నాయకులు ఎవరైనా అక్కడ ఉన్నారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత పదవిలో ఉన్న వాళ్లు మరెవ్వరైనా అక్కడున్నారా అని ప్రశ్నిస్తూ, పోయెస్ గార్డెన్ లో కల్పించిన భద్రతపై లేఖలో స్టాలిన్ విరుచుకు పడ్డారు. అక్కడున్న భద్రతా సిబ్బందికి నెలసరి జీతంతో పాటు అదనంగా రిస్క్ అలెవెన్స్ రూ.ఆరు వేలు చొప్పున అందుతూ వస్తున్నదని గుర్తుచేశారు. వీరికి సకల సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు. నిత్యం రోడ్డు మీద ట్రాఫిక్ కట్టడి లక్ష్యంగా, నేరగాళ్లను పట్టుకునేందుకు రేయింబవళ్లు గస్తీలో ఉన్న పోలీసులకు కూడా దక్కని సౌకర్యాలు, ప్రత్యేక సదుపాయాలు పోయెస్ గార్డెన్ లోని సిబ్బందికి అందుతున్నట్టు వివరించారు.
వీటన్నింటికీ అయ్యే ఖర్చు ప్రజాధనం నుంచే వెచ్చిస్తున్నారన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. ప్రైవేటు సెక్యూరిటీ వలే కోర్‌సెల్ సీఐడీ అక్కడ ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. 240 మంది ప్రత్యేక సిబ్బంది, అదనంగా మరో 60 మంది నగర పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో కొనసాగాల్సినంత అవసరం ఉందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఉన్నాయని, సిబ్బంది కొరతతో పని భారంతో ఉన్న వాళ్లు తీవ్ర సంకటంలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఎవ్వరూ లేని పోయెస్ గార్డెన్ లో మూడు వందల మందిని ఎలా భద్రతా విధుల్లో నియమించగలరని ప్రశ్నించారు. ఆ సిబ్బందిని వెనక్కు పిలిపించి, ప్రజలకు భద్రత కల్పించేందుకు తగ్గట్టుగా ఇతర బాధ్యతల్ని అప్పగించాలని కోరారు.