చెన్నై, సాక్షి ప్రతినిధి : దేశంలోని ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసన తెలుపుతూ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన
Published Wed, Oct 9 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : దేశంలోని ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసన తెలుపుతూ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్న పారిశ్రామికవేత్తలను అడ్డుకునేందుకు కార్మికులు పరుగులు తీశారు. వారిని రక్షణదళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు.
భారత దేశంలోని చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, జైపూర్, లక్నో, గౌహతి ఏయిర్‌పోర్టులను టెండర్ల ద్వారా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి 31 వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీన టెండరు ఖరారు చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు పేర్కొంది. ఇలా ఉండగా కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోగానే ఎయిర్‌పోర్టు కార్మికులు భోజన విరామ సమయాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టెండరు పాడదలుచుకున్న ఏడుగురు పారిశ్రామికవేత్తలు మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న కార్మికులు అకస్మాత్తుగా నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించి నిరసనకు దిగారు. పారిశ్రామికవేత్తలను వెతుక్కుంటూ జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. భద్రతా దళాలు వారిని అడ్డుకోగా ఇరువర్గాల మధ్య తోపులాట ప్రారంభమైంది. ఇంతలో సదరు పారిశ్రామికవేత్తలంతా ఆరవ గేటు వద్ద ఉన్నారని తెలుసుకుని కార్మికులు ఆపైపు పరుగులు పెట్టారు. వారు అక్కడికి చేరుకునేలోగానే వచ్చిన పనిని పూర్తిచేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారు. కార్మికుల ఆందోళనతో వివిధ విమానాల నుంచి దిగిన ప్రయాణికులు వెలుపలికి వెళ్లలేకపోయారు. అన్ని గేట్ల వద్ద కార్మికులు గుమికూడడంతో గందరగోళం నెలకొంది. విమానాల రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలుగలేదు.
Advertisement
Advertisement