యువతరం నేరచరితం..!
నమోయువాభ్యాం.. అంటూ వేదాలు సైతం యువకుడికి తొలి ప్రాధాన్యతనిస్తున్నాయి. అటు బాల్యంలోనూ.. ఇటు వృద్ధాప్యంలోనూ జీవితాన్ని నిర్మించుకునే అవకాశం చాలా తక్కువ. అందుకే యవ్వనమే ఉజ్వల భవిష్యత్తుకు సరైన సమయమంటారు. కానీ సరిగ్గా యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలోనే యువతరం దారి తప్పుతోంది.
న్యూఢిల్లీ: తమ భావి జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు, యువకులు దారితప్పుతున్నారు. టీనేజ్‌లో తామేం చేస్తున్నామో తెలుసుకోలేని పరిస్థితులలో తప్పుడు పనులకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే యువత ఎలా పెడదోవ పడుతుందో స్పష్టమవుతోంది. వరుసగా జరిగిన ఘటనలు అటు బాధిత కుటుంబాలనేగాక సమాజాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదివి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను చదువులకు పంపిస్తుంటే, తోటి స్నేహితులతో కలిసి రకరకాల వికృత చేష్టలకు పాల్పడడం ద్వారా కన్న వారికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు.
ప్రేమించమంటూ అమ్మాయిలను వేధించడం... ప్రేమించనివారిపై అఘాయిత్యాలు చేయడం.. డబ్బు కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సెల్‌ఫోన్ల ద్వారా యువత ఇంటర్నెట్‌ను వాడుతూ అశ్లీల దృశ్యాలు, చిత్రాలను చూస్తూ పెడదోవ పడుతున్నారనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇంటర్నె ట్ ద్వారా జీవితానికి ఉపయోగపడే అంశాలకు బదులు, ఇతర విషయాల్లోకి మరలుతుండడంతో వారు దారి తప్పుతున్నారు. నేరస్తులుగా మారుతున్నారు. తద్వారా ఉన్నత చదువుల లక్ష్యం కూడా దెబ్బతింటోంది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి.
సినిమాలు, నేర కథనాల ప్రభావం
కౌమార దశ నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తాము చేసేది మంచో చెడో తెలుసుకోలేక పోతుంటారు. ఇదే సమయంలో సినిమాలు, నేర కథనాలను చూసిన యువత, విద్యార్థులు వాటిని అనుకరించడానికి యత్నిస్తుంటారు. ముఖ్యంగా సినిమాలలో టీనేజ్ ప్రేమను ఉద్దేశించినవే ఎక్కువగా వస్తున్నా యి. అందులోని అశ్లీలం, నేర సన్నివేశాలు యువత పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో సినిమాలలో తనను ప్రేమించని అమ్మాయిలపై విలన్‌లు జరిపే దాడులు వారి మెదడులో నిండిపోతున్నాయి. నిజజీవితంలో తాము ప్రేమలో విఫలమయ్యామని గ్రహించి చాలామంది యువకులు అలాంటి నేర ప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది.
సామాజిక స్పృహను కలిగించే బోధనలు చేయాలి...
గతంలో యువత, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం తపించేవారు. సమాజాన్ని గురించి తెలుసుకునేవారు. పాశ్చాత్య పోకడలతో నేటి యువత త్వరగా దారి తప్పుతున్నారు. యువత, విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బోధనలు చేయాల్సిన అవసరం ఉంది. కెరీర్‌తో పాటు సమాజం గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా సరైన మార్గంలో నడపవచ్చు. అలాంటి ప్రయత్నాలు విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇటీవల జరిగిన సంఘటనలు...
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి నైజీరియన్లతో కలిసి మత్తుమందులు అక్రమంగా రవాణా చేస్తూ ఇండియాగేట్ పరిసరాల్లో గురువారం పోలీసులకు చిక్కాడు.
చాందినీచౌక్ ప్రాంతంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి గొలుసును లాక్కెళ్తూ శుక్రవారం పట్టుబడిన ఇద్దరు విద్యార్థులు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో 12వ తరగతి చదువుతున్నారు.
స్నేహితురాలికి శీతల పానీయంలో మత్తుమందు కలిపి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు యువకులు ఆగస్టు 19న పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా బీటెక్ విద్యార్థులే కావడం గమనార్హం.
పొరుగునే ఉంటున్న ఓ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఓ బాలుడిని గత నెల 22న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడు తూర్పుఢిల్లీ మున్సిపల్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు.
మణిపూర్‌కు చెందిన ఓ యువతిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదైంది. వీరిలో ఒకడు పట్టుబడగా మిగతా ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గత నెల 25న చోటుచేసుకుంది.