
చెన్నై: వరాలిచ్చే దేవుడే కాదు ప్రాణాలు హరించే యముడు సైతం తమిళనాడులో పూజనీయుడైనాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తంజావూరు జిల్లాలో రూ.3 కోట్లతో యమధర్మరాజుకు వేల సంవత్సరాల నాటి ఆలయం ఉంది. ఇపుడు నూతన ఆలయం సిద్ధమైంది. పురాణగాథల ప్రకారం దేవతలు శివ దర్శనం కోసం కైలాసం వచ్చినపుడు శివుడు కళ్లు మూసుకుని కఠినమైన తపస్సు చేసుకుంటున్నాడు. కళ్లు తెరచి ఉన్న స్థితిలో శివుడు దర్శనం ఇచ్చేలా చేయాలనే ఆలోచనతో దేవతలు మన్మథుడిని రప్పించి తపస్సును భగ్నం చేశారు.
ఇందుకు అగ్రహించిన శివుడు మన్మథుడిని భస్మం చేస్తాడు. ఆ తరువాత ఆయన భార్య రతీదేవి వచ్చి శివుడిని ప్రార్థించడంతో మన్మథుడిని తిరిగి బతికిస్తాడు. ఆ సమయంలో ప్రాణాలు హరించే బాధ్యతను తనకు అప్పగించాలని యమధర్మరాజు శివుడిని కోరగా శివుడు సమ్మతిస్తాడు. ఇందుకు గుర్తుగా పూర్వీకులు తంజావూరు జిల్లా పట్టుకోటై సమీపంలోని తిరుచ్చిట్రంబళం గ్రామంలో యమధర్మరాజుకు ఆలయం నిర్మించారు. యమధర్మరాజుకు సదరు బాధ్యతల అప్పగింతలకు కారణమైన శివుడికి సైతం కొద్ది దూరంలో మరో ఆలయాన్ని నిర్మించారు.
యమధర్మరాజుకు ఆలయం నిర్మించి 1,300 ఏళ్లు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఈ గ్రామంలోనే రూ.3 కోట్లతో యముడికి కొత్తగా ఆలయాన్ని కూడా నిర్మించి మట్టితో యముడి విగ్రహాన్ని తయారుచేసి ప్రార్థనలు జరిపామని తెలిపారు. మట్టి విగ్రహం స్థానంలో ఆరు అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువు ఉన్న శిలావిగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. జనవనరి 22వ తేదీన కొత్త ఆలయంలో యముడికి కుంభాభిషేకం జరుపుతామని వారు చెప్పారు.