
టీ.నగర్ (చెన్నై): నలభై ఏళ్ల కిందట ఉద్యోగ వేటలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి వాట్సాప్ గ్రూప్ ద్వారా శుక్రవారం కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. తిరునల్వేలి జిల్లా వికె.పురం గ్రామానికి చెందిన అబ్దుల్ రహమాన్‌కు భార్య మీరా, కుమారులు ఇబ్రహీం, అబ్దుల్ హమీద్, ఇస్మాయిల్, బషీర్ అహ్మద్, కుమార్తె జైనన్బు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇబ్రహీం 1977లో తన 35వ ఏట ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత అతని గురించి సమాచారం తెలియలేదు.
ఇలా ఉండగా గత వారం నెల్‌లై జిల్లా వాట్సాప్ గ్రూప్‌లో వికె.పురానికి చెందిన ఇబ్రహీం మహారాష్ట్రలోని సతారా జిల్లా, కరాత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం వ్యాపించింది. దీన్ని గమనించిన కుటుంబీకులు అందులో పేర్కొన్న వ్యక్తిని సంప్రదించి మహారాష్ట్రలోని కరాత్‌కు వెళ్లి ఆస్పత్రిలో ఇబ్రహీంను కలిశారు. అక్కడ ఇబ్రహీం స్నేహితులు ఉగేష్, రాజా, ఖాజా ఉన్నారు. అతన్ని శుక్రవారం వికే.పురంలోని ఇంటికి తీసుకువచ్చారు. పక్షవాతంతో ఉన్న ఇబ్రహీంకు ప్రస్తుతం 75 ఏళ్లు.