ఉద్యోగుల చేతుల్లోకి జియోఫోన్
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తొలి బ్యాచ్ జియో ఫోన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తొలి బ్యాచ్ జియో ఫోన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. బీటా ట్రయల్స్‌కు కోసం ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్‌ను ఎంపికచేసిన యూజర్లకు రిలయన్స్ జియో అందిస్తోంది. సెప్టెంబర్‌లో ప్రజలకు అందించే ముందు ఈ ఫోన్‌ను టెస్ట్ చేయాలని రిలయన్స్ జియో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఏజీఎంలోనే ప్రకటించింది. తొలుత ఈ ఫోన్‌ను బీటా ట్రయల్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత, మార్కెట్‌లోకి తెస్తామని తెలిపింది. ప్రస్తుతం తన ఉద్యోగులు, తమ నెట్‌వర్క్ పరిధిలోని వ్యక్తులతో జియో ఫోన్‌ను రిలయన్స్ బీటా టెస్ట్ చేస్తుంది. ఈ ట్రయల్స్‌లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలు ఏమైనా ఉన్నాయో కంపెనీ గుర్తించనుంది.
ఇప్పటివరకు ఫీచర్ ఫోన్లలో మనం చూడని చాలా ఫీచర్లను జియో ఫోన్ ఆవిష్కరించింది. దేశంలో 22 భాషలను ఇది సపోర్టు చేస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా పనిచేస్తుంది. జియో సినిమా యాప్‌లో సినిమాలు, టీవీ ఛానల్స్ ఉచితంగా చూడొచ్చు. 4జీ వాయిస్‌ఓవర్ ఎల్‌టీఈ ఇంటర్నెట్, మల్టిమీడియా యాప్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రయల్ కాలంలోనే ఈ ఫీచర్లు ఎలా పనిచేయనున్నాయో రిలయన్స్ పరీక్షించనుంది.
జియో ఫోన్ బుకింగ్స్:
అధికారికంగా ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నప్పటికీ, ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు ఈ ఫోన్ బుకింగ్స్‌ను చేపడుతున్నాయి. ఆధార్ కార్డుతో ఈ ఫోన్ బుకింగ్ చేసుకోవచ్చని ఆ ఆఫ్‌లైన్ స్టోర్లు చెబుతున్నాయి. అయితే ఒక్కో వినియోగదారినికి కేవలం ఒకే ఒక్క యూనిట్‌ను మాత్రమే బుక్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్యలో డెలివరీ చేయనున్నట్టు తెలుస్తోంది. బుకింగ్ సమయంలో కాకుండా.. ఫోన్ డెలివరీ చేసిన సమయంలోనే రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్ చెల్లించే అవకాశముంది.