
గుండాల: పురిటి నొప్పులతో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. మార్గమధ్యలో మల్లన్నవాగులో నీటి ఉధృతి పెరగడంతో ఆమెను అతికష్టం మీద వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు.
అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మార్గమధ్యలోని మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నొప్పులతో బాధపడుతున్న ఆమెను వాగు దాటించి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.