108.. ఎప్పుడూ లేట్
అక్టోబర్ 30న సుగ్లాంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌కు చెందిన సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 108కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ అదే రాత్రి మరణించాడు.
కమాన్‌పూర్ మండలం కన్నాల పరిధి పాతలంబాడి తండాకు చెందిన లావుడ్య బద్యానాయక్(65) నెల రోజుల క్రితం బసంత్‌నగర్ టోల్‌గేట్ సమీపంలో రోడ్డుపై పల్సర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు టోల్‌గేట్ అంబులెన్స్‌ను తాత్కాలికంగా పెట్రోలింగ్ వాహనంగా మార్చుకుని సిబ్బంది సుల్తానాబాద్ సమీపంలో ఉన్నారు. బసంత్‌నగర్ బస్‌స్టాప్‌లో ఉండే 108 కూడా అందుబాటులో లేదు. దీంతో ఓ ట్రాలీలో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
ఇవీ... జిల్లాలో రోడ్డు ప్రమాదాలఅనంతరం పరిణామాలు. క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి గట్టెక్కించే 108 అంబులెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం... అందుబాటులో అత్యవసర వైద్యచికిత్స అందించే ఆసుపత్రులు లేకపోవడం... సకాలంలో వైద్యం అందక ఏటా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
* రహదారులపై రక్తపుటేరులు
* అత్యవసరాల్లో ఆదుకోని అంబులెన్‌సలు
* క్షతగాత్రుల తరలింపులో జాప్యం
* గాల్లో కలుస్తున్న ప్రాణాలు
కరీంనగర్ సిటీ : జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు నాలుగున్నాయి. ఈ రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. శనిగరం నుంచి జిల్లాలోకి ప్రవేశించే రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగితే తప్పనిసరిగా కరీంనగర్‌కు తీసుకురావాల్సిందే. గంట ప్రయాణం చేస్తే తప్ప క్షతగాత్రుడికి వైద్య సహాయం అందించలేరు. ఈలోగా బాధితుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. హుజూరాబాద్ నుంచి వరంగల్ రూట్‌లో ప్రమాదాలు జరిగితే, వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుంటారు. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ మార్గమధ్యంలో ప్రమాద బాధితులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సిందే.
కరీంనగర్ నుంచి రాయపట్నం రూట్‌లో ప్రమాదం జరిగితే కరీంనగర్ ఆసుపత్రే దిక్కు. కోరుట్ల, మెట్‌పల్లి ఏరియా ఆసుపత్రులున్నా, అత్యవసర వైద్య సేవలు అక్కడ అంతంతమాత్రమే. ఇక కరీంనగర్, జగిత్యాల రహదారిలో ఎక్కడ ప్రమా దం జరిగినా కరీంనగర్‌కు రావాల్సిందే. అత్యవసర చి కిత్స అందించే వైద్యులు ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండకపోవడంతో తప్పనిసరిగా జిల్లా కేం ద్రానికే తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీం తో అత్యవసర పరిస్థితుల్లో నూ గంటల తరబడి ప్రయాణం చే యాల్సి రావడంతో బాధితుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండాపోతోంది.
108లు కూడా ఎ ప్పుడు అందుబాటులో ఉంటా యో తెలియని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఐదు నిమిషాల ప్రయాణ దూరం ఉండే ఎల్‌ఎండీలో రోడ్డు ప్రమాదం జరిగితేనే 108 దిక్కులేక పోవడం, జిల్లా లో ఆంబులెన్స్ సేవల దుస్థితిని తెలియజేస్తోంది. జిల్లాలో రేణికుంట, బసంత్‌నగర్ వద్ద టోల్‌గేట్‌లున్నాయి. ఈ రెండు చోట్ల విధిగా అంబులెన్స్ ఉండాలి. ఉన్నాయి కూడా... కానీ, అవసరానికి మాత్రం అందుబాటులో ఉండవనే విమర్శలున్నాయి. బసంత్‌నగర్ టోల్‌గేట్ వద్ద ప్రమాదం జరిగితే అంబులెన్స్ లేకపోవడంతో ఆటోలో తరలిస్తుండగా బద్యానాయక్ అనే క్షతగాత్రుడు మరణించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
30 కిలోమీటర్లకు ఒక 108 ఉన్నా..
నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ప్రధాన కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లున్నాయి. జిల్లాలో 108 అంబులెన్స్‌లు 32 ఉండగా, అందులో ఫిట్‌నెస్‌లేనివి 25. సకాలంలో మరమ్మతు చేయించక కండీషన్ తప్పుతున్నాయి. గతంలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్క ట్యాబ్లెట్ కూడా పనిచేయడం లేదు. ఆక్సీజన్ లీకేజీలు, వెంటిలేటర్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. చివరకు అంబులెన్స్ డీజిల్ ట్యాంకులకు మూతలు లేకపోవడంతో, మక్కజొన్న, క్లాత్‌లు చుట్టిపెట్టి నెట్టుకొస్తున్నారు.
అర్జంట్ అవసరాల్లో 108కు ఫోన్‌కాల్స్ వస్తే... అదే సమయంలో చాలా వరకు అంబులెన్స్‌లు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఐఎఫ్‌టీ కేసులను ట్రాన్స్‌పోర్టు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సకాలంలో సేవలందక క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు.
రాజీవ్ రహదారి వెంట 108 సర్వీసులు ఉన్నా... ఆపద సమయంలో ఆదుకునేందుకు రావనే భావన ప్రజల్లో ఉంది. 108, హైవే అంబులెన్స్ అందుబాటులో లేక.. సమయానికి ఆసుపత్రులకు చేరక 2015 జనవరి నుంచి ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు. 108 సర్వీసులను పెంచడం, ఉన్న అంబులెన్సులను సక్రమంగా వినియోగించడం, అత్యవసర సేవలకు ప్రాధాన్యతనివ్వడం, సరిపడా వైద్యులను నియమించడం, ఏరియా ఆసుపత్రులను మెరుగుపరిస్తే తప్ప క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.
ప్రమాణాలకు విరుద్ధంగా రహదారుల నిర్మాణం
జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులున్నా, సరైన ప్రమాణాలతో నిర్మించలేదనే ఆరోపణలున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల, జాతీయ రహదారుల నిర్మాణంలో మూ లమలుపులు (కర్వ్స్) తొలగి స్తారు. కానీ, జిల్లాలో నిర్మించిన రహదారులను ఉన్నది ఉన్నట్లుగా కేవలం విస్తరించారే తప్ప మూలమలుపులు సరిచేసే ప్రయత్నం చేయలేదు. దీంతో మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేడిపల్లి వద్ద వాహనాలు గమనించుకోకపోవడంతో తూఫాన్ వాహనం, లారీ ఢీకొట్టిన సంఘటనలో భూపాల్‌పల్లికి చెందిన తొమ్మిది మంది అసువులు బాశారు.
ధర్మపురి మండలం ఖమ్మర్‌ఖాన్‌పేట క్రాస్‌రోడ్ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ గతంలో ఆటో, లారీ ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు చనిపోయారు. మూలమలుపు వద్ద రోడ్డు కనిపించకపోవడంతో లారీ చెట్టును ఢీకొని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. కొలిమికుంట మూలమలుపు వద్దా అదే పరిస్థితి. ఇటీవల నవ దంపతులు దుర్మరణం చెందింది అక్కడే. వెదిర వద్ద రెండు బ్రిడ్జీలు ఉండడంతో... ఎటువెళ్లాలో తికమకకు గురై, నేరుగా బ్రిడ్జిని ఢీ కొడుతున్న సంఘటనలు అక్కడ సర్వసాధారణం.
2015లో ప్రమాదాలు 1573
మృతులు 610
క్షతగాత్రులు 1802
2016 (ఇప్పటివరకు) 220
మృతులు 80
జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారుల వివరాలు..
♦ సికింద్రాబాద్-కరీంనగర్- రామగుండం (ఎస్‌హెచ్ 1 - రాజీవ్ రహదారి) : జిల్లాలో శనిగరం నుంచి రామగుండం వరకు 115 కిలోమీటర్లు
♦ వరంగల్-కరీంనగర్-రాయపట్నం (ఎస్‌హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి రాయపట్నం వరకు 120 కిలోమీటర్ల మేర ఉంది.
♦ వరంగల్-కరీంనగర్-జగిత్యాల (ఎన్‌హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు 120 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది.
♦ మెట్‌పల్లి-జగిత్యాల-రాయపట్నం (ఎస్‌హెచ్): జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గండిహన్మాన్ నుంచి జగిత్యాల, ధర్మపురి మీదుగా రాయపట్నం వరకు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
డేంజర్ జోన్స్
⇒ మెట్‌పల్లి శివారులోని ఆరెపేట, మేడిపల్లి
⇒ చొప్పదండి మండలం ఆర్నకొండ శివారు మూలమలుపు, ఖమ్మర్‌ఖాన్‌పేట్ ఎక్స్ రోడ్, కొలిమికుంట శివారులోని మూలమలుపు.
⇒ దేశ్‌రాజ్‌పల్లి సమీపంలోని కెనాల్ మలుపు, వెదిర బ్రిడ్జి, కురిక్యాల మలుపు, గంగాధర దాటగానే ఉన్న మలుపు, నమిలికొండ, కొం డగట్టు నుంచి మల్యాల క్రాస్‌రోడ్ వరకు.
⇒ సుగ్లాంపల్లి, నారాయణపూర్ క్రాస్‌రోడ్, అందుగులపల్లి, రామగుండం క్రాస్‌రోడ్.
⇒ మానకొండూరు మండలం సదాశివపల్లి, గట్టుదుద్దెనపల్లి, ఈదులగట్టెపల్లి బ్రిడ్జి, కొత్తగట్టు.
108 అందుబాటులో ఉండే ప్రాంతాలు
రాజీవ్ రహదారి : బెజ్జెంకి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్‌నగర్, రామగుండం.
వరంగల్-రాయపట్నం రహదారి : హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, వెల్గటూరు.
కరీంనగర్-జగిత్యాల రహదారి : కరీంనగర్, గంగాధర, మల్యాల, జగిత్యాల.
మెట్‌పల్లి నుంచి రాయపట్నం : మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి.