సాక్షి, హైదరాబాద్: త్వరలో వివిధ రాష్ట్రాల్లో పోలీస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న దాదాపు 119 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయ్యారు. విచిత్రమేమిటంటే పరీక్ష రాసినవారి సంఖ్య 122 అయితే, 90 శాతం మంది అభ్యర్థులు పరీక్ష తప్పారన్నమాట. ఇది నేషనల్ పోలీస్ అకాడమీ చరిత్రలో ఓ రికార్డు. వాస్తవానికి 136 మంది అధికారులు పరీక్ష రాయగా... వీరిలో 14 మంది ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్‌ఎస్)కు చెందినవారు. అంటే పరీక్ష రాసిన ఐపీఎస్‌ల సంఖ్య 122 కాగా, వీరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినవారు 119 మంది. అంటే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులైనవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
జరిగిందేమిటంటే...: ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షల్లో పాసైనవారిలో అర్హులైన ఐఏఎస్ అధికారులకు ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇండియన్ పోలీసు సర్వీస్(ఐపీఎస్) అధికారులకు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇలా 2016 బ్యాచ్‌కు చెందిన అభ్యర్థుల పరీక్షల ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. వీరిలో 119 మంది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేదు.
ఇలా శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయినా, వీరికి గ్రాడ్యుయేషన్ ఇవ్వడమేగాక ప్రొబేషన్ కింద అధికారులుగా నియమిస్తారు. అయితే, వీరు అన్ని సబ్జెక్టులను పూర్తి చేసేందుకు మరో రెండు అవకాశాలు ఇస్తారు. అంటే పరీక్ష పాసయ్యేందుకు మొత్తం మూడు అవకాశాలుంటాయన్నమాట. ఈ మూడుసార్లు ఫెయిలయితే వారిని సర్వీసులో కొనసాగించరు.
టాపర్స్ కూడా...
మొత్తం 136 మంది ఆఫీసర్లలో 133 మంది ఆఫీసర్లు ఒకటి లేదా రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిలయ్యారు. ప్రధానంగా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లలో కూడా వీరు ఫెయిల్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. పాసింగ్ ఔట్ పరేడ్‌లో మెడల్స్, ట్రోఫీలు పొందిన టాపర్స్ కూడా ఫెయిల్ అయినవారిలో ఉన్నారు. అకాడమీ చరిత్రలో ఇంతమంది ఫెయిల్ కావడం అరుదని ఓ అధికారి అన్నట్లు టైమ్స్ రాసింది.
పరీక్షల్లో ఫెయిల్ కావడం సాధారణమేనని, కాని ఇలా గంపగుత్తగా 90 శాతం మంది ఫెయిల్ కావ డం ఇదే మొదటిసారని ఓ అధికారి అన్నారు. లా అండ్ ఆర్డర్ వంటి ప్రాథమిక సబ్జెక్ట్‌లలో కూడా చాలా మంది ఫెయిల్ అయినట్లు పత్రిక రాసింది. ఇక్కడ పొందే మార్కులు సీనియారిటీ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇక్కడి పరీక్షలను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ శిక్షణ 45 వారాల పాటు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment