‘నోట్ల రద్దు’ తర్వాత ఏపీ, తెలంగాణలో ఐటీ శాఖ చర్యలివి
సాక్షి, హైదరాబాద్: నోట్లు రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు, దాడుల్లో వందల కోట్లలో కొత్త, పాత నోట్లు, నల్లధనం బయటపడుతుంటే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పట్టుకున్నది రూ.11 కోట్లు మాత్రమే. ఇందులో కొత్త నోట్ల విలువ రూ.1.9 కోట్లు. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా చేసిన తనిఖీలు, సోదాలు 11 మాత్రమే. ఇక ఆస్తులు, బంగారం రూపంలో కలిపి గుర్తించిన మొత్తం నల్లధనం రూ.280 కోట్లు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ నీనా నిగమ్ వెల్లడించిన సమాచారం ఇది.
సోమవారం హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ తీసుకున్న చర్యలను నీనా నిగమ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 30 తనిఖీలు/సోదాలు నిర్వహించామని.. రూ.760 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను గుర్తించామని తెలిపారు.