సాక్షి, హైదరాబాద్: డీజిల్ కారు కొంటే ఇకపై 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించనుంది. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ధర ఉన్న డీజిల్ కారుకు 12 శాతం పన్ను విధిస్తుండగా.. ఇకపై అది 14 శాతానికి పెరుగుతుంది. అదే రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న డీజిల్ కార్లపై పన్ను 16 శాతంగా ఉండనుంది.
ప్రస్తుతం తెలంగాణలో అమ్ముడవుతున్న డీజిల్ కార్ల సంఖ్య ఆధారంగా బేరీజు వేసుకుంటే ప్రభుత్వానికి ఈ అదనపు పన్ను రూపంలో కనిష్టంగా ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే అంత మొత్తం వాహనదారులపై భారం పడినట్లేనన్నమాట. డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులో ఏకంగా డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించే యోచన కూడా ఉంది.
వాటితో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో నిషేధం అమలులోకి కూడా వచ్చింది. తెలంగాణలో అంత ప్రమాదం లేనందున, డీజిల్ కార్ల కొనుగోలుపై వాహనదారుల్లో ఆసక్తి తగ్గించేందుకు పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 2 శాతం అదనపు పన్ను విధించాలంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రెండో వాహనం కొంటే అదనపు భారం లేనట్టే..
ఇక రెండో వాహనం కొనటాన్ని తగ్గించే యోచనతో గతంలో విధించిన రెండు శాతం అదనపు పన్నును ఎత్తేయబోతున్నారు. వాహనం ఏదైనా రెండోది కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం అమలులో ఉంది. దాని వల్ల కొత్త రిజిస్ట్రేషన్లు ఏమాత్రం తగ్గలేదని, ఆ ఆలోచన ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదని రవాణా శాఖ అభిప్రాయపడుతోంది. పైపెచ్చు దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొని వాహనదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఓ వ్యక్తి ఎప్పుడో కొన్న తొలి వాహనాన్ని విక్రయించిన తర్వాత మరో వాహనం కొన్నా ఈ రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. తాను మొదటి వాహనాన్ని వాడటం లేదని, దాన్ని ఎన్నడో అమ్మేసినట్టు మొత్తుకున్నా అధికారులు వినటం లేదు. మరోవైపు కొన్ని వర్గాల్లో ఎక్కువ మందికి ఒకే రకం పేర్లు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి తండ్రుల పేర్లు కూడా ఒకేలా ఉంటున్నాయి.
అలాంటి వారు తొలి వాహనం కొన్నా, అదే పేరున్న మరో వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉంటే, దాన్ని మరొకరు రెండో వాహనం కొన్నట్టుగా పొరబడుతూ అధికారులు ఈ రెండు శాతం పన్ను విధిస్తున్నారు. తనకు మరో వాహనం లేదని మొత్తుకుంటున్నా, కంప్యూటర్‌లోని జాబితాలో ఆ పేరు గల వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉన్నట్టు చూపుతోందని అధికారులు చెబుతున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో అధికారులకు వెరిఫికేషన్ పెద్ద సమస్యగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుకుని రెండో వాహనం కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం ఎత్తేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదించింది. దీన్ని ఎత్తేయటం వల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.21 కోట్ల మేర అదనపు రాబడి కోల్పోతుందని నివేదికలో పేర్కొంది. డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించటం వల్ల వచ్చే రాబడితో పోలిస్తే ఇది పెద్ద నష్టం కాదని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment