వే ఆఫ్‌ బెంగాల్‌ | 3000 TMC Water Flows Into Bay Of Bengal | Sakshi
Sakshi News home page

వే ఆఫ్‌ బెంగాల్‌

Published Sat, Sep 14 2019 1:44 AM | Last Updated on Sat, Sep 14 2019 1:44 AM

3000 TMC Water Flows Into Bay Of Bengal - Sakshi

శ్రీశైలం నుంచి ప్రవాహాలతో నాలుగు రోజుల్లోనే సాగర్, ఐదు రోజుల్లో పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. ఇక ఈ నెలతో పాటు అక్టోబర్, నవంబర్‌ మాసాల్లోనూ తుపాన్‌ల ప్రభావంతో కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రీశైలానికి ఈ ఏడాది వచ్చే నీరు కొత్త రికార్డు సృష్టించనుంది. ఇక నాగార్జున సాగర్‌కు సైతం ఎన్నడూ లేని రీతితో ఈ ఏడాది 675 టీఎంసీల నీరు రావడం గమనార్హం. శుక్రవారం సైతం కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి స్థిరంగా వరద కొనసాగుతోంది. 4.25 లక్షల క్యూసెక్కుల మేర వృథాగా బంగాళాఖాతంలోకి వెళుతోంది.

గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి గరిష్ఠంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 1,040.47 టీఎంసీలకుపైగా వచ్చాయి. పదేళ్ల కిందట తర్వాత శ్రీశైలానికి 7లక్షల క్యూసెక్కుల మేర గరిష్ట ప్రవాహాలు నమోదయ్యాయి. 

సాక్షి, హైదరాబాద్‌ : పశ్చిమ కనుమల్లో గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు కురవడం, మహారాష్ట్ర, కర్ణాటక నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరదలు పోటెత్తడంతో ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. రెండు ప్రధాన నదీ బేసిన్‌లలోని ఉపనదుల పరివాహకంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. నిండగా మిగిలిన నీరంతా రికార్డు స్థాయిలో సముద్రంలోకి వెళుతోంది. ఇక గోదావరి బేసిన్‌లో వృథాగా వెళు తున్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన ప్రాజెక్టుల నిర్మా ణాలు పూర్తి కాకపోవడంతో వరదంతా కడలిపాలవుతోంది. ఆరేళ్ల రికార్డులు బద్దలు కొడుతూ కృష్ణా, గోదావరి నదుల నుంచి ఈ ఏడాది వంద రోజుల్లో 3 వేల టీఎంసీల నీరు వృథాగా బంగాళాఖాతం(బే ఆఫ్‌ బెంగాల్‌)లో కలిసిపోయింది. 

వినియోగంలోకి రాక.. 
కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఈ వాటాలకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండగా, వరద జలాలపై ఆధారపడి తెలంగాణ నెట్టెంపాడు (20 టీఎంసీ), కల్వకుర్తి (40 టీఎంసీ), ఏఎంఆర్‌పీ (30 టీఎంసీ), పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీ), డిండి (30 టీఎంసీ)లతో ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కాకపోవడంతో కృష్ణా బేసిన్‌లో ఎంత నీరొచ్చినా, దానిని ఏపీ, తెలంగాణ 66ః34 నిష్పత్తిలో వాడుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమకు వచ్చే వాటాల మేరకు నీటిని రాష్ట్రాలు తమ పరివాహకంలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి.

ఈ మేరకు నీటిని వాడుకుంటున్నాయి. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో తెలంగాణ 50 టీఎంసీల మేర నీటిని వినియోగించుకోగా, ఏపీ 165 టీఎంసీల వినియోగించుకుంది. రాష్ట్రం చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడుల కింద 30 టీఎంసీల మేర వినియోగం జరగ్గా, సాగర్‌ కింద మరో 20 టీఎంసీల వినియోగం జరిగింది. ఇక మరే ఇతర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పంపుల సామర్థ్యం తక్కువగా ఉండటం, వాటికింద రిజర్వాయర్లు లేకపోవడంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరదలు వస్తున్నా నీటిని ఒడిసిపట్టలేదు. దీంతో ఈ ఏడాది గరిష్టంగా 360 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లింది. 2013–14లో సముద్రంలోకి వెళ్లిన జలాలు 399 టీఎంసీ ఉండగా, ఈ తర్వాత ఈ ఏడాదే గరిష్ట వరద బంగాళాఖాతంలో కలిసిపోయింది.

ప్రాజెక్టులు పూర్తి కాక...
ఇక గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్‌ వంటి ప్రాజెక్టుల కింద 470 టీఎంసీల మేర నీటి వినియోగం ఉండగా, ఈ ఏడాది ఈ మూడు ప్రాజెక్టుల్లోకి కేవలం 35 టీఎంసీల మేర మాత్రమే కొత్త నీరు వచ్చి చేరింది. ఇది పక్కనపెడితే మరింత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం (180 టీఎంసీ), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇవన్నీ వస్తే మరో 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుంది. అయితే ప్రస్తుతం తుపాకులగూడెం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. సీతారామ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నుంచి పాక్షికంగా వినియోగంలోకి వస్తుంది. దేవాదులలో అత్యంత కీలకమైన పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయి. ఇక కాళేశ్వరం ద్వారా 20 టీఎంసీల మేర నీటిని మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసినా, పూర్తిస్థాయి ఎత్తిపోత జరగలేదు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని దాటుతూనే 500 టీఎంసీల మేర నీరు దిగువలోకి వెళ్లింది. ఇదిపోనూ దిగువ ఇంద్రావతి, శబరి నదుల నుంచి కలిపి మొత్తంగా ఇప్పటికే 2,642 టీఎంసీ సముద్రంలోకి వెళ్లింది. గత ఏడాదంతా కలిపి 2,446 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లగా, ఈ ఏడాది కేవలం వంద రోజుల వ్యవధిలో 2,642 టీఎంసీ సముద్రంలోకి వెళ్లింది. 

పదేళ్లలో శ్రీశైలానికి గరిష్టం..
గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణా నది ఉప్పొంగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్ఠంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 1,040.47 టీఎంసీలకుపైగా వచ్చాయి. పదేళ్ల కిందట తర్వాత శ్రీశైలానికి 7లక్షల క్యూసెక్కుల మేర గరిష్ట ప్రవాహాలు నమోదయ్యాయి. 

సముద్రంలో కలసిన గోదావరి, కృష్ణా జలాలు... (టీఎంసీల్లో)
సంవత్సరం        గోదావరి        కృష్ణా
2005–06        3,772        1,249
2006–07        4,874        986
2007–08        2,853        899
2008–09        1,865        305
2009–10        707            707
2010–11        4,053        411
2011–12        1,538        209
2012–13        2,969        55
2013–14        5,827        399
20014–15        1,987        73
2015–16        1,611        9
2016–17        2,895        55
2017–18        1,025        0
2018–19        2,446        39
2019–20        2,642         360

గత పదేళ్లలో శ్రీశైలం జలాశయం వద్ద నీటి లభ్యత
సంవత్సరం        జలాలు(టీఎంసీలు)
2009–10        1,218.55
2010–11        1,024.54
2011–12        727.26
2012–13        197.53
2013–14        842.77
2014–15        614.05
2015–16        58.56
2016–17        337.95
2017–18        485.48
2018–19        583.68
2019–20        1,040.47

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement