
పోలీసు..పంజా
పోలీసులు పంజా విసిరారు. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఐదుగురు కరుడుగట్టిన తీవ్రవాదులను మట్టుబెట్టారు. ప్రతి విషయానికి పోలీసులపై దూషణలు..అయినా వదిలేశారు. మరోమారు అదే తీరు..మూత్రవిసర్జనకు బస్సు ఆపడంతో ఎదురుతిరిగి పారిపోయే యత్నం.. అంతే తుపాకుల గర్జనతో ఆ ప్రాంతం మారుమోగింది. తీవ్రవాదులున్న బస్సు రక్తసిక్తమైంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో టంగుటూరు గ్రామ రెవెన్యూ శివారులో మంగళవారం ఉదయం జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్(38)తోపాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ.హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి చెలరేగింది. - భువనగిరి/ ఆలేరు
భువనగిరి/ ఆలేరు :ఆలేరు శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఐజీ నవీన్ చంద్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జైలులో ఉన్న డీజేఎస్ తీవ్రవాదులు వికారుద్దీన్, సిమి కార్యకర్తలు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ.అనీఫ్, జోహార్‌ఖాన్‌లను ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌లోని నాంపల్లి 7వ మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకెళ్లేందుకు ఉదయం 8.30 గంటల సమయంలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరారు. ఈ సమయంలో తీవ్రవాదులకు బందోబస్తుగా 18 మంది సిబ్బంది ఉన్నారు.
వరంగల్ జిల్లా సరిహద్దు దాటి నాలుగు కిలోమీటర్లు రాగానే 09.20 గంటల సమయంలో తీవ్రవాదులు మూత్రవిసర్జన చేయాలంటూ పోలీసులను అడిగారు. ఇందుకు సమ్మతించిన పోలీసులు వారిని కిందికి దిగాలని కోరారు. అయితే ఈ సమయంలో పోలీసులపై తిరగబడ్డారు. అటు పోలీసులకు, ఇటు ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 09.30 గంటల సమయంలో వికారుద్దీన్‌తో పాటు వెంటఉన్న వారు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారికి ఆయుధాలు అందకుండా ప్రతిగా కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు తీవ్రవాదుల చనిపోయారని ఐజీ చెప్పారు. కాగా ఈ సంఘటనలో ఆర్‌ఎస్‌ఐ సోమన్న గాయపడినట్లు తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వికారుద్దీన్‌కు సిమి, ఐఎస్‌ఐ, లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
వాహనంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు..
ఈ ఎన్‌కౌంటర్ వాహనంలో జరగడంతో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఐదుగురు తీవ్రవాదుల్లో ముగ్గురు కూర్చున్న సీట్లోనే కుప్పకూలగా.. ఇద్దరు సీట్ల మధ్య కిందపడిపోయారు. ఎస్కార్ట్ వాహనం రక్తపు మడుగుగా మారింది. బస్సు వెనుకభాగంలోనుంచి రక్తంధారగా కింద పడడంతో భూమిపై కొంతభాగం తడిసిపోయింది. వాహనం చాలాసేపు నిలిపి ఉంచడంతో మూడు చోట్ల రక్తం కిందికి కారింది.
బయటపడిన బుల్లెట్లు
ఎన్‌కౌంటర్ సందర్భంగా బుల్లెట్లు వాహనంలో నుంచి ఎగిరి బయటపడ్డాయి. పోలీసులు మృతదేహాలున్న వాహనాన్ని అక్కడినుంచి పోస్టుమార్టం కోసం తరలించిన తర్వాత అవి కిందపడి కనిపించాయి. అయితే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎస్కార్ట్ వాహనంలో పేలని బుల్లెట్లు కూడా పడి ఉన్నాయి.
సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని ఐజీ నవీన్‌చంద్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు గంగాధర్, మల్లారెడ్డి, నల్లగొండ, వరంగల్ ఎస్పీలు కిషోర్, దుగ్గల్‌లు సందర్శించారు. అదే విధంగా భువనగిరి, డీఎస్పీ మోహన్‌రెడ్డి, ఆర్డీఓ ఎన్.మధుసూదన్‌లు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించారు.
మీడియాపై పోలీసుల ప్రతాపం
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం జాతీయ రహదారిపై ఉండడంతో వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున వచ్చారు. ఎన్‌కౌంటర్ జరిగిన వాహనం వద్దకు ఎవరినీ వెళ్ల నీయకుండా భారీ బందోబస్తు పెట్టారు. కనీసం ఫొటోలు తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. దీంతోపాటు రెండు జిల్లాల నుంచి పెద్దఎత్తున జనం వచ్చారు. ఎన్‌కౌంటర్ మృతులను చూసేందుకు పోటీపడ్డారు. ఈ దశలో పలుమార్లు పోలీస్‌లు లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురు రోడ్డుకిందికి పరుగెత్తే క్రమంలో కిందపడి గాయాలపాలయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. ఎవరినీ అనుమతించకుండానే పోస్టుమార్టం కోసం మృతదేహాలను అదేవాహనంలో వరంగల్ జిల్లా జనగామకు తరలించారు.
శవపంచనామా చేసిన ఆర్డీఓ
భువనగిరి ఆర్డీఓ ఎన్. మధుసూదన్ తీవ్రవాదుల శవ పంచానామా నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ రామ్మూర్తి, సీనియర్ అసిస్టెంట్ భగత్, వీఆర్‌ఓ వెంకట్‌రెడ్డిలు ఉన్నారు.