రాజుల కాలంలో నిర్మించిన కోటలు నాటి పాలనకు సజీవ సాక్ష్యాలు. ఆ కట్టడాలు అప్పటి పరిస్థితులకు అద్దం పడతాయి. నిర్మాణం, శిల్ప కళతో పాటు శత్రుదుర్భేద్యంగా నిర్మించడంలో పాలకులు వైవిధ్యం కనబరిచేవారు. అలా సరిగ్గా 500 ఏళ్ల క్రితం గోల్కొండ కోట నిర్మించారు. కాకతీయులు, బహుమనీలు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసీప్ జాహీలు పాలించిన అద్భుతమైన కోట ఇది. ఈ కోట నిర్మాణానికి 500 ఏళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం...
– సాక్షి, హైదరాబాద్
మట్టి కోట నిర్మాణం...
క్రీ.శ. 1083 నుంచి 1323 వరకూ కోట కాకతీయుల పాలనలో ఉంది. గోల్కొండ అసలు పేరు గొల్ల కొండ. ఇక్కడ ఓ గొర్రెల కాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడింది. ఈ విషయాన్ని కాకతీయ రాజులకు తెలుపగా వారు ఆ విగ్రహం చుట్టూ 1143లో మట్టి కోటని నిర్మించారు. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా మారింది. తర్వాత కాలంలో ఈ కోట అనేక రాజులు మారి 1518 సంవత్సరంలో కులీ కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. కుతుబ్ షాహీ రాజుల కాలంలోనే మట్టి కోట స్థానంలో ఇప్పుడున్న రాళ్ల కోటను కట్టించారు. 1689లో మొఘలులు దండయాత్ర చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు.
మట్టి కోట స్థానే రాళ్ల కోట...
బహుమనీ సుల్తాన్‌ల రాజ్యం పతనమయ్యాక కుతుబ్ షాహీ పాలన వచ్చింది. సుల్తాన్ అలీ కుతుబ్ షా గోల్కొండకు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఈయన గోల్కొండ కోటను రాళ్లతో నిర్మించాలని భావించాడు. అప్పుడే యుద్ధాల్లో కొత్తగా ఫిరంగి వినియోగిస్తున్నారు. దీనికి మట్టి కోట తట్టుకోలేదని, రాళ్ల కోట నిర్మించాడు. దేశంలోని ఇతర కోటలను వేరే ప్రదేశం నుంచి తెచ్చిన రాళ్లతో నిర్మించగా, గోల్కొండకు మాత్రం అదే గుట్ట అంటే నల్లకొండ రాతినే వినియోగించారని చరిత్రకారులు చెబుతారు.
పద్మవ్యూహాన్ని తలపించే మెట్లు...
120 మీటర్ల ఎత్తున్న నల్లరాతి కొండపై గోల్కొండ కోటను నిర్మించారు. శత్రువుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఎత్తైన గోడను నిర్మించారు. ఇది 87 అర్ధ చంద్రకార బురుజులతో 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన సింహ ద్వారాలు ఉన్నాయి. రాజ దర్బారుకు చేరాలంటే మూడు మార్గాలున్నాయి. మొదటిది నేరుగా రాజదర్బారుకు వెళితే... రెండో దారిలో సైనికుల నివాసాలు కనిపిస్తాయి. ఇక్కడి మెట్లు ఓ పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. శత్రువులు ప్రవేశించినా చివరికి సైనిక స్థావరాల్లోకి వెళ్లేలా వీటిని నిర్మించడం వారి ప్రతిభకు తార్కాణంగా చెప్పొచ్చు. ఈ కోటకు ఉన్న ప్రధాన ద్వారాలను ఇనుముతో నిర్మించారు. వీటి ఎత్తు సుమారు 24 అడుగులు. పర్షియా, ఇస్లామిక్ నిర్మాణ శైలిలో కోటను నిర్మించారు. కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లున్నాయి. ఇవేగాక మరెన్నో ప్రత్యేకతలు ఈ కోట సొంతం.
ధ్వని.. ప్రతి ధ్వని విధానం..
గోల్కొండ నిర్మాణం పర్షియన్ ఆర్కిటెక్చర్ ఓ అద్భుతం. 500 ఏళ్ల క్రితమే ఉపయోగించిన ఇంజనీరింగ్ విధానం ఆశ్చర్యపరుస్తుంది. కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పైవారికి సమాచారం చేరవేసేందుకు ధ్వని.. ప్రతి ధ్వని.. అనే విధానాన్ని వినియోగించారు. కోట కింద భాగంలో చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో లోపల ఉండే బాలాహిసార్ వద్ద ఆ శబ్దం వినిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం కనిపించకుండా ముందు కర్టెన్ వాల్ నిర్మించారు. కోటలో ఊట బావులు, వర్షపు నీటి నిల్వ బావులు ఏర్పాటుచేశారు. వీటిలోకి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న దుర్గం చెరువు నుంచి నీళ్లు వచ్చేవి. దీని కోసం మట్టి పైపులు, ఇనుప చక్రాలు వాడేవారు.
67 ఏళ్ల వరకు నిర్మాణం..
ఏదైన కట్టడాన్ని కింది నుంచి పైకి కడతారు. కానీ గోల్కొండను పైనుంచి కిందికి కడుతూ వచ్చినట్లు చారిత్రక పుస్తకాల ద్వారా తెలుస్తోంది. 1518, సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో కోట నిర్మాణం ప్రారంభించగా, 1585 మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం వరకు నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 67 ఏళ్లపాటు ఐదుగురు పాలకుల హయాంలో నిర్మాణం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment