పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో స్వస్థలాలకు తరలుతున్న బాలకార్మికులు
హైదరాబాద్: పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం రామంతపూర్ డాన్‌బాస్కోలో ఆశ్రయం పొందుతున్న 271 మంది బాలకార్మికుల్లో మొదటివిడతగా 82 మందిని ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక బోగీలో అధికారులు పంపించారు. వీరికి పర్యవేక్షకులుగా డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి, ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లతో పాటు బాలల సంరక్షణాధికారులు వెళ్లారని జిల్లా బాలల సంరక్షణాధికారి ఇంతియాజ్ తెలిపారు. కాగా, చికెన్‌ఫాక్స్‌తో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రెస్క్యూహోమ్‌లోని 12 మంది బాలకార్మికులు కోలుకున్నారు. వారందరినీ మంగళవారం డిశ్చార్జ్ చేసి పంపేశారు. వీరిని బుధవారం వారి స్వస్థలాలకు పంపనున్నారు.
అదృశ్యమైన కొడుకు కోసం ఆరా!
హైదరాబాద్: బాలకార్మికులకు విముక్తి కల్పించారని తెలుసుకున్న గుంటూరుకు చెందిన షేక్‌బాజీ దంపతులు తప్పిపోయిన తమ కుమారుడు షేక్ మహ్మద్ కోసం ఇక్కడికి వచ్చారు. పాట్నా రైలులో ప్రయాణిస్తున్న బాలల్ని, అధికారులను కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే 97030 39115 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకున్నారు.