హైదరాబాద్ సిటీ : మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా భార్యాభర్తలపై కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా భర్త ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ వెంకటయ్య, కురువమ్మ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కర్మన్ఘాట్ క్రిస్టియన్ కాలనీలో నివాసముంటూ కూలీ పని చేస్తున్నారు.
గురువారం కూలీపనికి వెళ్లి వచ్చిన వెంకటయ్య దంపతులు బీఎన్‌రెడ్డినగర్‌లోని సాగర్ రహదారిపై ఉన్న కల్లు కాంపౌండుకి వెళ్లాడు. సరిగా అదే సమయంలో సరూర్‌నగర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన భువనగిరి ఆంటోని (38) కల్లు కాంపౌండ్‌లోకి వచ్చి తన దగ్గరున్న కత్తితో మద్యం మత్తులో భార్యాభర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో భార్యాభర్తల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక డెల్టా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య కురువమ్మ(35) మృతి చెందగా, భర్త వెంకటయ్య (40) చికిత్స పొందుతున్నాడు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
నిందితుడు ఆంటోని సంతోష్‌నగర్‌లో ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాజత్‌సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 12 సంవత్సరాల క్రితం ఆంటోనిని భార్య వదిలి వెళ్లిపోయిందని, ఇటీవలే ఆంటోని మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె కూడా వదిలి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఆంటోని తన వెంట కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. తాగిన మైకంలోనే అన్యోన్యంగా ఉన్న వెంకటయ్య దంపతులపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడు ఆంటోనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో ఉన్మాదిగా మారి...
Published Fri, Feb 13 2015 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement