సాక్షి, మంచిర్యాల : సంక్షేమ వసతిగృహాల్లో లోపాలు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కొలిక్కివస్తున్నాయి. హాస్టళ్లలో జరిగే అవినీతిని అరికట్టేందుకు, విద్యార్థులకు నాణ్యమైన భోజ నంతోపాటు సదుపాయాల కల్పనకు అవినీతే అడ్డంకిగా మారిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను, హాజరును ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని, తద్వారా వారికి అందే సదుపాయాలు, హాజరు వంటివాటిని పరిశీలించే అవకాశం ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాల సేకరణ చేపడుతున్నారు.
ఆన్‌లైన్ ఆధారంగా..
జిల్లాలో దళిత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్‌లో 76 హాస్టళ్లు ఉండగా పోస్ట్‌మెట్రిక్ 14 వసతి గృహాలు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు ప్రీ మెట్రిక్‌లో 50 ఉండగా పోస్ట్ మెట్రిక్‌లో 20 హాస్టళ్లు ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో ప్రీ మెట్రిక్‌లో ఒకటి, పోస్ట్ మెట్రిక్‌లో మరొకటి ఉంది. ఎస్టీ హాస్టళ్లలో మొత్తం విద్యార్థులు 38,214 మంది ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానం గురించి ఇప్పటికీ ఏమీ సమాచారం రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ హాస్టళ్లలో దాదాపు 28వేల వరకు విద్యార్థులున్నారు. అయితే ఎస్టీ మినహా మిగతా విభాగాల్లోని హాస్టల్‌లలో నెలకొన్న అవినీతిని తొలగించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
ఇందుకోసం విద్యార్థుల ఆధార్ నంబరును ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరును పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే విద్యార్థులు హాజరుకాకపోయినా హాజరు అయినట్లు రిజిస్టర్‌లో నమోదు చేయడం, విద్యార్థులందరికీ వంటచేసినట్లు రికార్డులు తయారు చేయడం తద్వారా నిధుల దుర్వినియోగం వంటి చర్యలకు చెక్‌పడనుంది.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు హాస్టల్ వార్డెన్లచే సరుకుల కొనుగోలు చేయించిన ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయా హాస్టళ్లకు కాంట్రాక్టర్ ద్వారా పప్పులు, నూనెల, కారం, ఉప్పు, చింతపండు, ఇతరత్రా వస్తువులు అందజేసే విషయాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఆధార్ అనుసంధానం కొలిక్కి
Published Sun, Aug 31 2014 11:36 PM | Last Updated on Fri, May 25 2018 6:14 PM
Advertisement