ఆరోగ్యశ్రీ నిధుల గోల్‌మాల్
ఇష్టానుసారంగా మందులు, ఇంప్లాంట్స్ కొనుగోలు ప్రోత్సాహకాలు చెల్లింపులో అక్రమాలు
సుమారు రూ.2కోట్ల మేర తారుమారు విచారణకు ఆదేశించిన కలెక్టర్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్. జిల్లా కేంద్ర ప్రభుతాస్పత్రి ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో ఉంది. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఆరోగ్యశ్రీ సేవల అవార్డును కూడా అందుకుంది. కానీ ఇదేస్థాయిలో ఆరోగ్యశ్రీ నిధులు కూడా గోల్‌మాల్ జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు సమాచారం. 2008 సంవత్సరంలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వార్డును ఏర్పాటు చేశారు. క్రిటికల్‌కేర్, ఈఎన్‌టీ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ సర్జరీ, పిడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, పాలిట్రామా, పల్మనాలజీ విభాగాలలో రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ వైద్యసేవలను అందించినందుకు గాను సుమారు రూ.7 కోట్ల అరోగ్యశ్రీ నిధులు విడుదల ఆయ్యాయి. వీటిని ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పొందుతున్న రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరమైన పరికరాలు, ఆర్ధోపెడిక్ ఇంప్లాంట్స్(రాడ్‌లు)ను ఆస్పత్రి కొనుగోలు కమిటీ ద్వారా టెండర్‌లను ఆహ్వానించి కొనుగోలు చేయాలి.
అదే విధంగా రోగులకు అవసరమైన భోజనాలను ఏర్పాటు చేయాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలను అందించిన డాక్టర్లకు, నర్సులకు, టెక్నీషియన్‌లకు, ఇతర సిబ్బందికి ప్రోత్సహం కింద నగదును చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించిన అధికారులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ నిధులను ఆస్పత్రి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తమకు అనుకూలంగా ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి మాత్రమే ప్రోత్సాహకాల కింద నగదును కొంత మొత్తం చెల్లించి మిగతా లక్షలాది రూపాయలను చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డులో నమోదు చేసి నట్లు సమాచారం.
అదే విధంగా రూ.ఐదు వేలకు మించి ఏదైనా మెటీరియల్‌ను కొనుగోలు చేయాలంటే టెండర్‌లను పిలిచి కొనుగోలు కమిటీ అనుమతితో కొనాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి నిబంధనలూ పాటించలేదని తెలిసింది.
అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇటీవల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ చిరంజీవులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదికను అందించాలని కలెక్టర్ ఇటీవల ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హరినాథ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జయకుమార్‌ను విచారణాధికారిగా నియమించారు.
మొదటిదఫాలో విచారణ జరిపిన ఆయన రెండవ దఫాలో విచారణను చేపట్టి త్వరలో జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే విచారణ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఈ అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.