ఆసరా లబ్ధిదారుల ఎంపికపై సూచనలు ఇస్తున్న డీఆర్డీఓ క్రాంతి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌కు సంబంధించి నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే ప్రభుత్వం çస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అధికారులు తొలుత 57–64 మధ్య వయస్సు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇంతవరకు 64 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందజేస్తుండగా టీఆర్‌ఎస్ తాజా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా భావించనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ప్రకారం కొత్తగా 66,760 మందికి ఆసరా పింఛన్ లభించే అవకాశముందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, డీఆర్డీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన క్రాంతి.. తొలిరోజే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. శాఖ అధికారులతో సమావేశమై ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
66,760 మంది గుర్తింపు
ప్రభుత్వం నుంచి వెలువరించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 64 నిండిన వారికి పింఛన్లు అందజేస్తుండగా.. తాజా నిర్ణయం మేరకు 57 నుంచి 64 ఏళ్ల మధ్య వారిని గుర్తిస్తున్నారు. తొలుత ప్రతీ జిల్లా నుంచి కొత్తగా ఎందరు లబ్ధిదారులకు ఎంపికయ్యే అవకాశముందో వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 66,760 మంది ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు.
ఇవీ నిబంధనలు
తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆసరా పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు పలు మార్గదర్శకాలకు వెలువరించింది. వీటి ప్రకారం 1953 నుంచి 1961 మధ్య జన్మించి 57 ఏళ్ల వయస్సు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తారు. వయస్సు నిర్ధారణ కోసం ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు.. చెల్క భూమి 7.5 ఎకరాలు, తరి 3 ఎకరాలు మించకుండా.. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లోనైతే రూ.1.5 లక్షలు, నగరాల్లోనైతే రూ.2 లక్షలు దాటకుండా చూస్తున్నారు. ఇక సంతానం వైద్యులు, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నా... ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపుల వంటి వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉన్న వారు, ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారిని కూడా అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవద్దు.
ఎంపిక విధానం
ఓటరు కార్డులోని వివరాల ప్రకారం 2018 నవంబర్ 19 నాటికి 57–64 సంవత్సరాల నిండిన వారిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తిస్తారు. ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాక.. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లోనైతే వీఆర్‌ఓలు, పట్టణాల్లోనైతే బిల్‌కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పొల్గొంటారు. ఎంపిక అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, వినతుల తర్వాత తుది జాబితా రూపొందిచనున్న అధికారులు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు సేకరిస్తారు. చివరకు ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆసరా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
గ్రామసభల ద్వారా..
జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా అధికారులువిభజించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తుండగా.. ఏకంగా 8 ఏళ్లు వయో పరిమితి తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 66,760 కొత్తగా ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తుది జాబితా రూపొదించాక ఈ సంఖ్య ఎంత మేరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వికలాంగులకు ఆసరా పింఛన్ కింద రూ.1500 అందజేస్తుండగా ఇది రూ.3,016కు పెరగనుంది. ఇక మిగతా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు చేరనున్నాయి. తద్వారా ఇప్పటికే పింఛన్ల రూపంలో ఇస్తున్న రూ.32,29,06,500లో భారీగా వ్యత్యాసం రానుంది. దీనికి తోడు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం ఇంకా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment