కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ బ్రాంచి కెనాల్ ఏఈ జిసి.మల్లయ్య సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్ తెలిపిన
మిర్యాలగూడ క్రైం : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ బ్రాంచి కెనాల్ ఏఈ జిసి.మల్లయ్య సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మం డలం తక్కెళ్లపాడుకు చెందిన కాంట్రాక్టర్ బొలిశెట్టి గంగాధర్ నాలుగు నెలల క్రితం గ్రామ పరిధిలోని మైనంవారిగూడెంలో రూ.8 లక్షలు, తాడిచెట్టుతండాలో రూ.6లక్షలు, దొండవారిగూడెం గ్రామ పరిధి సామ్యతండాలో రూ.8 లక్షలతో జాలుకాలువలకు గైడర్‌వాల్స్ నిర్మించాడు. ఈ పనులను నాలుగు నెలల క్రితం పూర్తిచేశాడు. ఎంబీ రికార్డు చేయాలని నెలరోజులుగా ఐబీ ఏఈ మల్లయ్య చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
రూ.1.50 లక్షలు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ స్పష్టం చేశాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గంగాధర్ మూడు రోజుల క్రితం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ముందుగా రూ.50వేలు, మరో రెండురోజుల అనంతరం మిగతా లక్ష రూపాయలు ఇస్తానని గంగాధర్ ఏఈతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఎసీబీ అధికారులు వలపన్ని రాత్రి సమయంలో ఏఈ ఇంటి వద్ద గంగాధర్ రూ 50వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ ఇంటి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనపర్చుకున్నారు.ఐబీ ఏఈ మల్లయ్యపై అవినీతి నిరోదకచట్టం కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాస్, ముత్తులింగం, సిబ్బంది ఉన్నారు.