సాక్షి, హైదరాబాద్: కొత్త చట్టంతో సంబంధం లేకుండా మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేసింది. ఈ నెల 14 తర్వాత ఏ క్షణాన నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా పురపాలక శాఖ సూత్రప్రాయంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 14 రోజుల్లో వార్డుల పునర్విభజన నుంచి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వరకు అన్నీ పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఏ మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఎన్ని వార్డులు చేయాలో నిర్ధారణ కాగా, ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియతోనే షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. నిర్దేశిత జనాభాకు అనుగుణంగా ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియ ఆదివారమే ప్రారంభమైంది. ఈ పునర్విభజన ప్రతిపాదనలను సోమవారం కల్లా సిద్ధం చేయాలని, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశమివ్వాలని, ఏడో తేదీ కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
8వ తేదీ నుంచి కీలక ప్రక్రియలు
వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాల తయారీపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టనుంది. ఈ మూడు ప్రక్రియలు 8వ తేదీ నుంచే ప్రారంభించి 12 కల్లా పూర్తి చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటు, అభ్యంతరాల స్వీకరణ, తుది ప్రచురణలకు నిర్దేశిత గడువును కూడా షెడ్యూల్‌లో ఉంచారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత రెండ్రోజుల్లో అంటే ఈ నెల 14వ తేదీ కల్లా వార్డు మెంబర్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు/మేయర్ల రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తారు. ఈ ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో మునిసిపల్ ఎన్నికల వ్యవహారాన్ని ఇక ఎలక్షన్ కమిషన్‌కు అప్పగిస్తామని ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధంగా ఉండేలా షెడ్యూల్ రూపొందించామని పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఈ నెల మూడో వారం ఆఖరు కల్లా మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది.
సూత్రప్రాయంగా ఖరారు చేసిన షెడ్యూల్:
1. వార్డుల పునర్విభజన:
- జూన్ 30 నుంచి జూలై1 వరకు నిర్దేశిత జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు తయారీ
- జూలై 2 నుంచి 5వ తేదీ వరకు ముసాయిదా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ
- జూలై ఆరో తేదీన అభ్యంతరాల పరిష్కారం, 7న ఎన్నికల సంఘం ద్వారా వార్డుల తుది జాబితా ప్రకటన
2. వార్డుల వారీ ఓటరు జాబితాల తయారీ:
- జూలై 8న వార్డుల వారీ ఓటరు జాబితాల తయారీ, 9,10 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు.
- 11వ తేదీన అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది జాబితా తయారీ, 12న తుది జాబితా ప్రచురణ.
3. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు:
- జూలై 8న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా తయారీ, 9,10 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు.
- 11న ముసాయిదా జాబితాలు కలెక్టర్లకు అందజేత, 12న కలెక్టర్ల అనుమతితో తుది జాబితా ప్రచురణ.
4. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా తయారీ:
- జూలై 8న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదా జాబితాల తయారీ, 9,10 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ.
- 11న క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, 12న తుది ఓటర్ల జాబితా ప్రచురణ.
(ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత రెండ్రోజుల్లో (14వ తేదీ కల్లా) రాష్ట్రంలోని 138 మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలోని వార్డు మెంబర్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. దీంతో పురపాలక శాఖ పని పూర్తవుతుంది. ఎప్పుడైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే వెసులుబాటు కలుగుతుంది)
Comments
Please login to add a commentAdd a comment