సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు కొత్త హంగులు అద్దుకుంటున్నాయి. కార్పొరేటు పాఠశాలలో ఉండే అన్ని రకాల సౌకర్యాలు వీటికి కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధికి చెందిన 1,415 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. రెగ్యులర్ టీచర్లతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ స్కూళ్లలో పెద్దగా విద్యార్థుల సంఖ్య లేదు. వీటిని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వంద పాఠశాలలను కార్పొరేటు స్థాయి హంగులతో మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతోంది.
ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించిన క్రమంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతోంది. గిరిజన శాఖ రూపొందిస్తున్న ఈ మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు వినోదాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోంది. బోధనేతర కార్యక్రమాల్లో క్రీడలు ఉండే విధంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. ప్రతి స్కూళ్లో క్రీడాసామగ్రి, పరికరాలను అమర్చుతారు. ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మించి ప్లే గ్రౌండ్ ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఈ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వేళ స్నాక్స్ ఇవ్వనున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రతి స్కూల్‌ను రంగులతో అలంకరించడం, బోధనకు సంబంధించిన అంశాలను గోడలపై పేయింట్ల రూపంలో పిల్లలకు అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా కార్పొరేటు స్కూళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment