అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డేవిడ్
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్, పంచాయతీ, మున్సిపల్, ఎస్సీ కార్పోరేషన్, మత్చ్యశాఖ, వ్యవసాయం, మార్కెటింగ్‌తో పాటు ఇతర శాఖలు కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చేవే. వీటన్నింటిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్యవేక్షణ జరుగుతుంది. ప్రభుత్వం ‘స్థానిక అభివృద్ధి’ వైపు దృష్టి సారించినందున స్థానిక సంస్థల ద్వారా జరిగే పనులన్నీ ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఉండాలని భావించి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్ట్ క్రియేట్ చేసింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పని చేస్తారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టడం, అవినీతి, అక్రమాలు జరగకుండా చూస్తారు. స్థానిక సంస్థల్లో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి రాబడి పెంచడం.. వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేయించడం వంటివి ఉంటాయని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం.డేవిడ్ అన్నారు. నూతన చట్టం ఎవరికీ చుట్టం కాదని, అక్రమాలకు పాల్పడితే చైర్మన్లనూ సస్పెండ్ చేసే అధికారం అధికారులకు ఉందని అంటున్న ఆయన.. సోమవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రధాన లక్ష్యం ఏమిటి.?
అదనపు కలెక్టర్: స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియామకమైన కలెక్టర్ ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థలను బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపించడం. స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సక్రమంగా వినియోగించేలా కృషి చేయడం. వృథా ఖర్చులను తగ్గించడం.. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, చట్టాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయించడం.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ స్థానిక సంస్థల ద్వారా విజయవంతం చేయడం వంటివి ఉన్నాయి.
సాక్షి:స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలపై ఎలా దృష్టి పెడతారు.?
అదనపు కలెక్టర్: గ్రామ పంచాయతీలకు చాలా రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇంటి పన్ను వసూళ్లు నుంచి ఇసుక పెనాల్టీ వరకు అన్ని రాబడిని పెంచేవే. అయితే ఆ నిధులను దేనికి వినియోగిస్తున్నారనేది క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పంచాయతీలో ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సృష్టించి వచ్చిన నిధులు పంచాయతీకే వినియోగించేలా చూస్తాం. ఇక మున్సిపాలిటీల్లో కూడా ఆస్తి పన్ను వసూళ్ల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకు చాలా మార్గాలు ఉన్నాయి. పట్టణాల్లో కూడా కొత్త ఆదాయ మార్గాల ద్వారా రాబడిని పెంచేలా కృషి చేస్తాం.
సాక్షి:అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అధికారాలు ఎలా ఉండనున్నాయి.?
అదనపు కలెక్టర్: స్థానిక సంస్థల్లో అవినీతి అక్రమాలు జరగకుండా చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేయించడం. అవినీతికి పాల్పడితే విచారణ చేపట్టడం. అవినీతికి పాల్పడ్డారని తేలితే చిన్నస్థాయి అధికారి నుంచి మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ఇదంతా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం పంచాయతీరాజ్, మున్సిపల్ నూతన చట్టాల్లో స్పష్టంగా ఉంది. అందుకే లోకల్ బాడీస్‌పై అదనపు కలెక్టర్ పూర్తిగా దృష్టి సారించనున్నారు.
సాక్షి:పచ్చదనానికి, పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుంది. ఇందులో మీరేలా ముందుకెళ్తారు.?
అదనపు కలెక్టర్: నూతన చట్టం ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్ బడ్జెట్‌లో 10 శాతం నిధులు గ్రీనరీకి కేటాయించాలి. ఈ నిధులతో గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం తీసుకొస్తాం. నర్సరీల ద్వారా పెంచిన మొక్కలను ఖాళీ స్థలాల్లో నాటి వాటిని సంరక్షిస్తాం. పట్టణాల్లో ప్రస్తుతమున్న పార్కులను అభివృద్ధి చేస్తాం. లేని చోట కొత్తగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పచ్చదనంతోపాటు పరిశుభ్రతకు ప్రధాన్యతనిస్తాం. డ్రెయినేజీలోని మురుగునీరు రోడ్లపై రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తాం. ఈ పనులన్నీ గతంలో పల్లె ప్రగతిలో చేశాం. ఇప్పుడు పట్టణ ప్రగతిలో కూడా చేస్తాం. ఇవి గ్రామాల్లో, పట్టణాల్లో నిరంతరంగా కొనసాగే పనులు.
సాక్షి:మున్సిపల్, పంచాయతీరాజ్ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం.?
అదనపు కలెక్టర్: పంచాయతీరాజ్, మున్సిపల్ సమ్మేళనాలకు స్థానిక సంస్థల సభ్యులను ఆహ్వానించి వారికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. చట్టాల గురించి వారికి అవగాహన లేకుంటే అదనపు కలెక్టర్‌కు ఉండే హక్కులను హరించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, ఇతర స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన కల్పించి స్థానిక సంస్థలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సమ్మేళనాలు చేపడుతుంటారు. దీంతో స్థానిక సంస్థలకు చట్టాలపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది.
సాక్షి:పల్లెల్లో, పట్టణాల్లో మీ పర్యవేక్షణ ఎలా ఉండనుంది.?
అదనపు కలెక్టర్: గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పూర్తి చేయించడం. పల్లెలు ప్రతి రోజు పరిశుభ్రత పాటించే విధంగా చూడడం. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, నర్సరీల్లో మొక్కలు పెంచడం, నాటిన మొక్కలు సంరక్షించడంపై దృష్టి సారిస్తాం. ప్రభుత్వం టాప్ ప్రయార్టీగా తీసుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయించడం, ట్యాక్స్ వసూలు, అభివృద్ధి పనులు, ప్రజలందరికీ మంచినీరు సరఫరా, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ఖర్చు, మిగులు వంటి వివరాలను ప్రభుత్వానికి నివేదించడం లాంటివి జరుగుతాయి. పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలు, తాగునీరు, రోడ్లు, మురికి కాలువల శుభ్రం, వీధి దీపాలు, భవన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులివ్వడం, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కాపాడడం, అక్రమ లే అవుట్లపై నిఘా సారించి చర్యలు తీసుకోవడ, పచ్చదనం, పరిశుభ్రత లాంటి తదితర వాటిపై పర్యవేక్షణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment