
పల్లెల్లో బోజర (ధర్మం) అడుగుతున్న గిరిజనులు
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : హోలీ పర్వదినంలో భాగంగా మొదటి రోజు పులారా కార్యక్రమాన్ని ముగించిన ఆదివాసీలు రెండో రోజు మంగళవారం రంగోత్సవం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కాముని దహనం చేసిన చోటే రాత్రంతా జాగరణ చేశారు. ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఆచారాలు, సంస్కృతిని కాపాడుతున్న ఆదివాసీలు మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.
బూడిదను దొంగలిస్తారని...
‘మాతారి మాతరల్’, కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేశారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో భాగం. అందుకే వేరేవారు ఎవ్వరూ కాముని దహనం చేసిన బూడిదను దొంగలించకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని పురుషులందరూ బూడిదకు రక్షణగా రాత్రంతా జాగరణ చేశారు. అంతకు ముందు కాముడి చుట్టూ సంప్రదాయ ప్రదర్శన చేశారు. సుమారు గంట సేపు డోలు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
లకాముని దహన స్థలంలో ఆదివాసీల భోజనాలు
గుడాలే నైవేద్యంగా
పులారా అనంతరం దురాడి రోజు మంగళవారం ఆయా ఆదివాసీ గ్రామాల్లోని పురుషులు ఉదయాన్నే మేల్కొని ఇంట్లో వంట చేసిన గుడాలతో గొడ్డలి, గడ్డపారలతో పొలిమేర వద్దకు వెళ్లి పొదలు కొట్టారు. నైవేద్యపు నీళ్లు చల్లి, పూజలు చేశారు. ఇప్పటి నుంచి పొలం పనులు ప్రారంభిస్తామని గ్రామ పటేళ్లు చెప్పారు. దురాడి తెల్లారి పొదలు కొట్టడం లాంటి కార్యక్రమంలో పొలం పనులు ప్రారంభిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారు చెబుతున్నారు. అనంతరం మళ్లీ కాముడి దహనం వద్దకు వెళ్లి గుడాలను నైవేద్యంగా సమర్పించారు. అక్కడే వాటిని ఆరగించాక కాముడి బూడిదను తీసుకెళ్లి తమతమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లారు. ఇలా చల్లడం వల్ల బయట శక్తులు ఇళ్లలోకి ప్రవేశించవని వారి నమ్మకం.
ఇంటింటికి ‘బోజర’
రెండు రోజుల కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాక చివరిగా డోలు వాయిస్తూ ‘జాజిరి.. జాజిరి.. జాజిరేయ్’ అంటూ ప్రతి ఇంటికీ తిరుగుతూ బోజర(ధర్మం) అడిగారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి బోజర అడుక్కున్నారు. దీంతో పల్లెలు డోలు వాయిద్యాలతో మారుమ్రోగాయి. మధ్యాహ్నం తర్వాత సమీప వాగుల్లో స్నా నాలు చేసి తమతమ ఇళ్లకు బయలుదేరారు.
ప్రదక్షిణలు చేస్తున్న ఆదివాసీలు
Comments
Please login to add a commentAdd a comment