ఆదివాసీ.. హస్తినబాట | Adivasi People Bahiranga Sabha In Delhi | Sakshi
Sakshi News home page

ఆదివాసీ.. హస్తినబాట

Published Sat, Dec 7 2019 7:59 AM | Last Updated on Sat, Dec 7 2019 9:27 AM

Adivasi People Bahiranga Sabha In Delhi - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీలు హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి కదిలి వెళ్తున్నారు. మొదట రైళ్లు, విమానాల్లోనే వెళ్తున్నారనే ప్రచారం జరిగినా వాహనాల్లోనూ పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. జిల్లా నుంచి ముందుగా అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో సభలో పాల్గొననున్నారు. జిల్లా నుంచే సుమారు 3వేల మంది వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదివాసీ ఉద్యమంలో హస్తిన సభ మరో మైలురాయిగా నిలిచే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల నుంచి శుక్రవారం వందలాది వాహనాలు ఢిల్లీ బాట పట్టాయి. వాహనాల్లో వెళ్లేవారు శుక్ర, శనివారాల్లో ప్రయాణాన్ని ఎంచుకొని 9న ఢిల్లీలో ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని బయల్దేరుతున్నారు.

కొంతమంది ఆదివాసీ నాయకులు శుక్రవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి తమ ఢిల్లీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆదివాసీల పోరాటానికి చిహ్నంగా నిలిచే ఈ స్తూపం నుంచే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. రైలు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో బోగీలను ముందస్తుగా బుక్‌ చేసుకొని సిద్ధంగా ఉన్న ఆదివాసీలు పెద్ద ఎత్తున శనివారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి బయల్దేరి వెళ్తున్నారు. ఇక హైదరాబాద్, నాగ్‌పూర్‌ నుంచి విమాన ప్రయాణానికి సంబంధించి ముందుగానే బుకింగ్‌ చేసుకున్న వందలాది మంది ఆదివాసీలు శనివారం రాత్రి బయల్దేరి వెళ్తున్నారు. 

  • డిసెంబర్‌ 9.. మళ్లీ ఈ తేదికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017 ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్‌ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మించి దేశ రాజధాని ఢిల్లీలో సభ చేపట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీల గర్జన వినిపించేలా చేస్తున్నారు. ఈ సభలో దేశంలోని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమైన నాయకులు పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి కూడా పాల్గొననున్నారని ఆదివాసీలు చెబుతున్నారు. ఇక్కడి ఆదివాసీలు మాత్రం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఏజెన్సీలో నకిలీ ధ్రువపత్రాల జారీని నిలిపివేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలనే ప్రధాన డిమాండ్లతో తమ గళాన్ని ఈ సభ ద్వారా వినిపించేందుకు సిద్ధమయ్యారు.
  • ఢిల్లీ సభకు సంబంధించి ఆదివాసీలు గత కొద్ది నెలలుగా ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా కదులుతూ వస్తున్నారు. నవంబర్‌ 18న ఉట్నూర్‌లో నిర్వహించిన ర్యాలీ ఢిల్లీ సభకు ముందు బలప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో పోలీసులు నిరంతరం నిఘా సారించడంతో ఆదివాసీలు సభ విషయంలో నిర్ణయాలకు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారని కొంతమంది ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. వేర్వేరు చోట్ల సమావేశాలు నిర్వహిస్తే సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతో రాయిసెంటర్లలో సార్‌మేడిల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా వేలాది మందిని ఈ సమావేశాల ద్వారా ఢిల్లీ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.
  • వందలాది వాహనాలు, రెండు రైళ్లలో వేలాది మంది బయల్దేరుతున్నారు. అలాగే వందలాది మంది విమాన ప్రయాణం ద్వారా ఢిల్లీ చేరుకోనున్నారు.పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఢిల్లీ వెళ్లిన ఎంపీ సోయం బాపురావు సభ జరిగే రాంలీలా మైదానాన్ని పరిశీలించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆదివాసీలు తరలిరానుండడంతో మైదానంలో స్థితిగతులను చూశారు. ఇలా అప్పటి నుంచే సభ విషయంలో సోయం బాపురావు ఏర్పాట్లను ముందుండి చేపట్టారు. ఆ తర్వాత జిల్లాకు తిరిగి వచ్చినా మళ్లీ పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఇటు సమావేశాల్లో పాల్గొంటూనే మరోపక్క  సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైలు మార్గం ద్వారా సభకు వెళ్తున్న వేలాది మందికి మధ్యలో రెండు చోట్ల భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలో రెండు ఫంక్షన్‌ హాళ్లలో ఇక్కడినుంచి వెళ్లేవారికి కోసం వసతి కల్పించారు. ఏదేమైనా 9న సభ ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఇది ఆదివాసీ అస్తిత్వ కోసం జరుగుతున్న పోరాటం. మొదట 5వేల మందితో ఢిల్లీలో సభ నిర్వహించాలని అనుకున్నాం. కాని పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా ఆదివాసీలు తరలివస్తుండడంతో ఈ సంఖ్యను అంచనా వేయడం కష్టమే. 50వేలకుపైగా తరలివచ్చే అవకాశం ఉంది. 35 మంది ఆదివాసీ ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు ఫగల్‌సింగ్‌ కులస్తే, రేణుక సరోడే, అర్జున్‌ ముండేలను ఆహ్వానించాం. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సోయం బాపురావు, ఆదిలాబాద్‌ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement