
జలమయమైన మల్కాజగిరిలోని ఎన్‌ఎండీసీ కాలనీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వందేళ్ల విరామం తరువాత డిసెంబరు నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. బేగంపేట్‌లోని వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 1918 డిసెంబరు ఒకటిన నగరంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రికార్డును అధిగమించి 2018 డిసెంబరు డిసెంబరు 13 అర్ధరాత్రి నుంచి డిసెంబరు 14(శుక్రవారం)ఉదయం 8.30 గంటల వరకు నగరంలో సరాసరిన 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవడం విశేషం. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా గ్రేటర్‌పరిధిలోనూ ఆకాశం మేఘావృతమై పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది.
అత్యధికంగా బొల్లారంలో 7.7, పాశమైలారంలో 6.5, మల్కాజ్‌గిరిలో 6.4, కుత్బుల్లాపూర్‌లో 5.6, శ్రీనగర్‌కాలనీలో 5.3, బీహెచ్‌ఈఎల్‌లో 4.9, బాలానగర్‌లో 4.8, బేగంపేట్‌లో 4.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. సరాసరిన గ్రేటర్ పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం గమనార్హం. రాగల 24 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గత పదేళ్లలోనూ ఈస్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం. ఇక 2010 డిసెంబరు 8న 1.5 సెంటీమీటర్లు, 2009 డిసెంబరు 27న కేవలం 4.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అత్యధికంగా 1918 డిసెంబరు ఒకటిన రికార్డు స్థాయిలో నగరంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం ఇప్పటివరకు ఉన్న రికార్డు.
చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి..
వాయుగుండం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆకాశం దట్టమైన మేఘాలతో ఆవహించి నగరంలో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. చలిగాలులతోపాటు గాలిలో తేమశాతం ఏకంగా 96 శాతానికి చేరడంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు ఇబ్బందిపడ్డారు. రాగల 24 గంటల్లో వాతావరణంలో స్వల్ప మార్పులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment