ముందుకు సాగని తాగునీటి పథకాల పనులు
రూ.కోట్లు ఖర్చు చేసినా.. చుక్క నీరందని పరిస్థితి
జిల్లాలో సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకాల దుస్థితి తీరిదీ..!
చెన్నూర్‌తో పాటు, 14 పరిసర గ్రామాల ప్రజల గొంతు తడిపేందుకు రూ.4.50 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ఇది. ఇప్పటికే ఈ పనులు పూర్తయి.. 2015 మార్చిలో దీని పరిధిలో ఉన్న నివాసిత ప్రాంతాలకు తాగు నీరందించాలి. కానీ ఇప్పటివరకు కనీసం 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ వేసవే కాదు, వచ్చే వేసవిలోనూ పథకం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఆదిలాబాద్ : వేసవి ముంచుకొచ్చినా.. తాగునీటి పథకాల పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లాలో రూ.వందల కో ట్లతో చేపట్టిన సమగ్ర సురక్షిత తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులు ముందుకు సాగడం లేదు. రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా.. ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల గొంతులు తడపడం లేదు. ఎప్పటి కప్పుడు పనులను పూర్తి చేయించడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పరిధిలో లేని సీపీడబ్ల్యూఎస్ (మల్టీవిలేజ్) పథకాల ప్రగతిని పరిశీలిస్తే.. జిల్లాలో 1,111 నివాసిత ప్రాంతాల కు తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు రూ.457 కోట్లుతో 22తాగునీటి పథకాల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఏడు తాగునీటి పథకాలను వాటర్‌గ్రిడ్ పరిధిలో చేర్చారు. మిగిలిన 15 సీపీడబ్ల్యూఎస్ పథకాల్లో ఏడు తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీలైనంత మేరకు బిల్లులు డ్రా చేసుకున్నారు. మిగిలిన పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు గడువు కొ న్నింటికి దగ్గర పడినప్పటికీ పనులు బాలారిష్టాలను దాటడం లేదు. కొన్నింటికి గడువు ముగిసినప్పటికీ పనులు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పథకాల పనుల తీరును పరిశీలిస్తే..
ఉట్నూర్‌తోపాటు, 42 నివాసిత ప్రాంతాల ప్రజల గొంతులు తడిపేందుకు రూ.10 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ పథకం పనులు చేపట్టారు. కాంట్రాక్టర్‌కు రూ. 5.54 కోట్ల మేరకు బిల్లులు చెల్లించారు. కానీ ప్రజల గొంతు మాత్రం తడవ డం లేదు. మూడేళ్లుగా పైప్‌లైన్ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించారు. గ్రామాలకు డిస్ట్రిబ్యూషన్ పనులు జరుగుతున్నాయి. మరో రెండేళ్లయినా ఈ పనులు కొలిక్కి వచ్చేలా లేవు.
చెన్నూర్ మండలం సోమన్‌పల్లి, మరో 17 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.9 కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు పూర్తి కావాలి. జూన్ వరకు తాగునీటిని సరఫరా చేయాలి. కానీ 2.5 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సిన పైప్‌లైన్ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు.
విద్యుత్ సౌకర్యం లేక రూ.1.52 కోట్లతో చేపట్టిన భీమారం తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా నిలిచాయి. విద్యుత్ కనెక్షన్ పూర్తయితే కానీ, ఐదు గ్రామాల ప్రజల గొంతు తడవదు.
ఏజెన్సీ ఏరియాలోని 187 ఆదివాసీ, గిరిజన గూడాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.68 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒక్క కెరమెరి మండలంలోని 47 నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసుతన్నారు.
లక్సెట్టిపేట, మరో నివాసిత ప్రాంతానికి ఫేస్ 2లో భాగంగా రూ.కోటి 41 లక్షలతో తాగునీటి పథకం నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటివరకు రూ.44 లక్షలు ఖర్చు చేశారు. కానీ.. ప్రజల గొంతు మాత్రం తడవలేదు.
మహారాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు పది ఆవాస ప్రాంతాలకు రూ.7.75 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పరిస్థితి కూడా అలాగే ఉంది. రూ.23 లక్షలు ఖర్చయినా పనులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
నీరుపయోగం
Published Wed, Feb 18 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement