సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌కృష్ణన్
సాక్షి, భూపాలపల్లి: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు.. ఆయన చరిత్ర చెత్తబుట్టలో పడుతుందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌కృష్ణన్ అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఇందిరాభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 29న భూపాలపల్లికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని, మధ్యాహ్నం 12 గంటలకు సభ ఉంటుందని, భూపాలపల్లి, ములుగు, మంథని, పరకాల నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని చెప్పారు. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ జాతీయ నేత మణి వస్తారని తెలిపారు.
ఎన్నో ఆశలు, కలలతో రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు కేసీఆర్ చేతిలో అధికారం పేడితే తెలంగాణను అథోగతి పాలు చేశాడని విమర్శించారు. ప్రజలు కోరుకున్న ఒక్క పనిని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని, ఆ పార్టీలను ప్రజలు నమ్మొదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. అనంతరం మాజీ చీఫ్‌విప్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ రాకతో నియోజకవర్గ ప్రజల్లో నూతనోత్తేజం రాబోతోందని, కాంగ్రెస్ ప్రచారాన్ని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. అనంతరం రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్న భూపాలపల్లి పట్టణంలోని సీఆర్‌నగర్ వద్ద ఖాళీ స్థలాన్ని నేతలు పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, అఫ్జల్, కటకం జనార్ధన్, మందల విద్యాసాగర్‌రెడ్డి, నూనె రాజు, ఇస్లావత్ దేవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment