విలేకరులతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి, కమలాపూర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపల్లిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తన కిరాయి రౌడీలతో తమపైనే దాడి చేయించాడని, ఆ కాంగ్రెస్ గూండాలపై, వారిని తమపైకి దాడికి పురిగొల్పిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఇనుగాల రవీందర్ డిమాండ్ చేశారు. మర్రిపల్లిగూడెంలో శుక్రవారం ఆయన స్థానికులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు భర్త మాదాడి వెంకట్‌రెడ్డి కౌశిక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు.
దీంతో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈటలనే విమర్శిస్తావా అని అడిగామని, ఇందుకు అతను తమను కులం పేరుతో దూషిస్తూ వీళ్లను పక్కకు లాక్కెళ్లి తన్నండని చెప్పాడని, దీంతో కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన గూండాలు, బౌన్సర్లు తమను లాక్కెళ్లి ఆయుధాలతో దాడి చేసి గాయపర్చారని ఆరోపించారు. ఆ తర్వాత తాము ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మాపై ఎక్కడ కేసు అవుతుందోనన్న భయంతో అరగంట తర్వాత వారి వాహనాల అద్దాలు వాళ్లే పగులగొట్టి ధ్వంసం చేసుకుని తమపై నెపం మోపారని ఆరోపించారు. సుమారు 30 నుంచి 40 మంది కాంగ్రెస్ గూండాలు, బౌన్సర్ల దాడిలో తనతో పాటు ఇనుగాల సారంగపాణి, వంగ రమేష్, సీహెచ్.బెనర్జీ, ఎండీ.ఖాసీం గాయపడ్డారన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. సమావేశంలో వంగ రమేష్ రత్నాకర్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment