అక్కడ మద్యం, డబ్బు ఊసేలేదు
- ‘సాక్షి’తో భన్వర్‌లాల్
- శ్రీలంక అధ్యక్ష ఎన్నికల తీరు మనకు విభిన్నం
- కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లూ లేవు
- అంతా ప్రింట్, ఎలక్ట్రానిక్మీడియాతోనే ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు అనగానే మైకులు, వాహనాలు, బ్యానర్లు, కటౌట్లు, మద్యం, డబ్బు పంపిణీ... ఊరూరా ప్రచారంతో హోరెత్తించడం మన దేశంలో మామూలే. కాని శ్రీలంకలో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఎన్నికలు జరుగుతాయి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు పరిశీలకునిగా రెండు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి భన్వర్‌లాల్ దాదాపు వారం పదిరోజులపాటు పర్యటించి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీలంక ఎన్నికల సమయంలో మూడు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అక్కడి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించి... దేశం మొత్తంమీద పోలైన ఓట్లను ఆరేడు గంటల్లో లెక్కించి ఫలితం ప్రకటించారు. మన దగ్గర పోలైన విధంగానే పోలింగ్ 72 శాతం పైగా నమోదు అయింది. అక్కడి ఎన్నికల్లో అనుభవాలు భన్వర్‌లాల్ మాటల్లోనే..
‘శ్రీలంక ఎన్నికల్లో హంగూ ఆర్బాటం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచేలా గోడలపై రాతలు, పోస్టర్లు అంటించరు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉండే జాఫ్నా ప్రాంతంలోని వావుయాన, ముల్తేవు(ఎల్‌టీటీఈపై చివరి యుద్ధం జరిగిన ప్రాంతం), మన్నర్ జిల్లాల్లో నేను విస్తృతంగా పర్యటించాను. జనవరి 2న వెళ్లగా, అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ 8న జరిగింది. పోలింగ్ రోజు కూడా ఈ ప్రాంతాల్లో బాగా పర్యటించి ఎన్నికల విధానాన్ని పరిశీలించాను.
ఎన్నికలు జరుగుతున్న వాతావరణమే ఎక్కడా కనిపించలేదు. అంతా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా బ్యానర్లు, కటౌట్లు, పోస్టర్లు సందడే ఉండదు. మైకుల హోరూ లేదు. అధ్యక్ష అభ్యర్థి తరుఫున జిల్లాకో ఏజెంట్‌ను నియమించారు. వారు మాత్రమే తిరిగారు. అభ్యర్థులు ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, పత్రికల్లో ప్రచారాన్ని కొనసాగించారు. అక్కడ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కాకుండా బ్యాలెట్‌తోనే నిర్వహించారు. ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఆరేడు గంటల్లో ఫలితాలు ప్రకటించడం విశేషం.
సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఓటింగ్ జరిగితే... ఆ బ్యాలెట్ బాక్సులను సాయంత్రం ఆరున్నర ఏడు గంటల్లోగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తీసుకుని వచ్చారు. రాత్రి ఏడున్నర నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అర్ధరాత్రి ఒకటిన్నర వరకు లెక్కించారు. యాభై శాతం పైగా ఓట్లు పొందిన వారు అధ్యక్షునిగా ఎన్నికవుతారు. ఓటర్లలో చైతన్యం ఎక్కువ. ఈసారి ఎన్నికలు పూర్తి నిశ్శబ్ద ప్రభంజనంలా జరిగాయి.
మన దగ్గర ఓటర్లను లైన్లలో నిల్చోమని చెప్పడానికి పోలీసులను ఉపయోగించాల్సి వస్తుంది. కాని అక్కడ అదేమీ ఉండదు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి క్యూ లైన్లలో నిల్చుని ఓట్లు వేసే క్రమశిక్షణ బాగుంది. ఈ ఎన్నికల పరిశీలన అనంతరం నేను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా పంపించాను. కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచే చర్యలను నిషేధించాలని సూచించా’ అని భన్వర్‌లాల్ తెలిపారు.