పులిటీషియన్లు.. కొంగబావలు  | Political Studies at the University of California | Sakshi
Sakshi News home page

పులిటీషియన్లు.. కొంగబావలు 

Published Wed, Nov 1 2023 3:13 AM | Last Updated on Wed, Nov 1 2023 3:13 AM

Political Studies at the University of California - Sakshi

అడవిలో పులి వేటకు బయలుదేరింది. కొంతకాలంగా ఆ అడవిలో దానిదే రాజ్యం. ఎంత కావాలంటే అంత ఆహారం. రోజుకో జంతువు విందు. అందుకే తాపీగా లేచి ఒళ్లు విరుచుకుని అడవి మీద పడింది. మాంచి ఆకలి మీద ఉందేమో కాసింత పెద్ద జంతువునే వేటాడేసి.. ఆరగించడం మొదలుపెట్టింది. పులికైనా పొలిటీషియన్‌ కైనా ఎంత తిన్నా ఆకలి అలాగే ఉంటుందని.. ఓ పెద్ద  రైటర్‌ ఏనాడో  చెప్పాడు. దొరికిన జంతువును ఆబగా తింటూండేసరికి దాని ఎముకగొంతులో ఇరుక్కుంది. దీంతో విలవిల్లాడిన పులి దాన్ని బయటకు తీయాలని అన్ని జంతువులను  బతిమాలింది. కొని పులి అరాచకంపై కోపంతో.. మరికొన్ని భయంతో మావల్ల కాదనేశాయి. ఇంతలో ఓ కొంగ దాని కంటపడింది.

కొంగ బావను ఎలాగైనా ఒప్పించాలని.. దానితో మాటలు కలిపి..తన బాధను చెప్పింది. ముందు కొంగ కూడా ససేమిరా అంది. అయితే  పులి  కొంగకు ఆశలు పెట్టింది. తాయిలాలు చూపింది.  అచ్చం ఎలక్షన్‌ టైమ్‌లో మన నాయకులలాగా.. ‘ ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, పింఛన్‌ పెంచుతాం. గ్యాస్‌ధర తగ్గిస్తాం..   ఈసారి ఓటేసి గట్టెక్కించండి...’’... అలా  కొంగ బావకు రకరకాల ఆశలు పెట్టింది. దానితో  కొంగ ఐసైపోయింది. మన ఓటరు లాగా.  ‘ ఆహా.. చిన్న సాయానికే బతుకు మారిపోతుందే..’ అనుకుంది.  

తన పొడుగాటి ముక్కు పులి నోట్లో తల పెట్టి ఎముక  చులాగ్గా లాగి పారేసింది.  పులి  ఊపిరి పీల్చుకుని  కొంగకు «థ్యాంక్స్‌ చెప్పి  బయలుదేరింది. అలా వెళుతున్న పులికి దాని బాసలు గుర్తుచేసింది. తొందరగా పని కానివ్వు అన్నట్టుగా. తర్వాత రెండు మూడు నెలలు గడిచాయి. పులి జాడలేదు. ఇచ్చిన మాట జాడలేదు. ఎలాగోలా పులిని వెతికి పట్టుకుని ‘..నీ మాటేమైంది..’ అని కొంగ అడిగింది. ‘ .. చూద్దాం అదే పనిలో ఉన్నా..’ అని పులి అక్కడ నుంచి జారుకుంది. అలా  నెలలు గడుస్తున్నాయి. ఉలకదు పలకదు. అచ్చం మన ప్రజాప్రతినిధిలా. ఓసారి పులి ఎదురైతే కొంగ గాట్టిగా నిలేసింది.  ‘..ఎంతో మేలు చేస్తానన్నావ్‌ నీ  పని అయిపోయాక తప్పించుకు పోతున్నావ్‌....’  అని.  

దానికి పులి చిద్విలాసంగా..‘‘  నేను నీకు మేలు ఎప్పుడో చేసేసాను.. నా నోట్లో నీ తల పెట్టినప్పుడు వదిలేశా.. అంతకన్నా మేలు ఏముంటుంది..’ అని తాపీగా నడుచుకుంటూ పోయింది.  కొంగబావ అవాక్కయ్యింది. ఎన్ని ప్రలోభాలు.. ఎన్ని మాటలు.. ఎన్ని మోసాలు అని తిట్టుకుంది. అది మనిషి కాదు కనుక దానికిది కొత్త.. మనకైతే ప్రతి ఐదేళ్లకోసారి అనుభవానికి వస్తూనే ఉంటుంది.  

ఎలక్షన్‌ వచ్చింది...పులిటీషియన్లను ఇప్పుడు ఓటర్లే కాపాడాలి.  ఎవరు మనవాళ్లు, ఎవరు విపక్షం, కొంగబావలాగా ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి?  ఏమిస్తామని ప్రలోభ పెట్టాలి..ఇలా ఎన్నో లెక్కలు.. 

.. ఇస్తే ఓటేసేవారెవరు? తీసుకుని మరీ వేరేవాళ్లకు వేసేదెవరన్న  ఈ అంశంపైనే అమెరికాకు చెందిన మిషిగన్, కాలిఫోర్నియా యూనివర్సిటీల పొలిటికల్‌ స్టడీస్‌ ప్రొఫెసర్లు.. ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఓట్ల కొనుగోళ్ల విషయంలో ఉన్న కొన్నిరకాల అభిప్రాయాలు తప్పు అని తేల్చారు. అభ్యర్థులు, ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషించారు. 

ఇది క్లైంటెలిజమ్‌! 
ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, వివిధ రకాల వస్తువులు, బహుమతులు పంచడమే క్లైంటెలిజమ్‌. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. దీనివల్ల అధికారం కొందరు రాజకీయ నేతలకే పరిమితమైపోతుంది. సిద్ధాంతపరమైన, సామాజిక ప్రయోజనకర అంశాలు పక్కనపడి.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైపోతాయి. దానితో అభివృద్ధి కుంటుపడుతుంది. 

తాయిలాలకు ఓట్లు రాలుతాయా? 
డబ్బులు, బహుమతులు తీసుకున్నవారంతా ఓటేస్తారా? ఏదైనా తీసుకున్నప్పుడు, మరొకటి తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలన్న సంప్రదాయం వర్కౌట్‌ అవుతుందన్న దానిపైనే తాయిలాలు తయారయ్యాయి... దీనిపై  చేసిన సర్వేలో .. 

ఓటర్లు డబ్బులు, బహుమతులను తీసుకున్నా కూడా తమకు ఓటేయరేమోనని లేక ఓటేయడానికే రారేమోనని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నట్టు పేర్కొంది. కొందరు ఓటర్లు కూడా డబ్బు తీసుకున్నాక వేరేవారికి ఓటేయడం పట్ల పెద్దగా  ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసమేనేమో.. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ఒట్టు పెట్టించుకోవడం, గుళ్లకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం, కుల సంఘాలు, అసోసియేషన్లలో ప్రమాణాలు చేయించడం వంటివి మన నేతలు చేస్తుంటారు. 

ఓట్లు అమ్ముకోవడం తప్పా? 
ఓట్లు కొనడం, అమ్ముకోవడం తప్పు అనే ప్రచారం ఉన్నా.. ఆ భావన అటు నేతల్లో, ఇటు ఓటర్లలోనూ కనబడటం లేదని అధ్యయనం పేర్కొంది. గెలవడానికి ఎంతెంత ఇచ్చాం, ఏమేం పంచామనేది నేతలు బహిరంగంగానే చెప్తున్నారని.. ‘వాళ్లు ఇస్తున్నారు. మేం తీసుకుంటున్నాం..’ అని చెప్పడానికి ఓటర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని వెల్లడించింది. అందుకే ఓటేయడా నికి డబ్బులు తీసుకోవద్దంటూ జరిగే ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండటం లేదని స్పష్టం చేసింది. 

వ్యతిరేకులపై ప్రభావం అంతంతే.. 
తమపై వ్యతిరేకత ఉన్నవారికి డబ్బులు, బహుమతులు ఇచ్చినా తమకు అనుకూలంగా ఓటేయర న్న విషయం రాజకీయ నాయకులకు తెలుసని అద్యయనం పేర్కొంది. తమకు అనుకూలమైన వా రిని అలాగే కొనసాగించుకునేందుకు, త టస్థంగా ఉన్నవారిని తమవై పు తిప్పుకొనేందుకు మా త్ర మే డబ్బులు పంచుతారని తేల్చింది. తమ వెంట నిలిచిన కార్యకర్తలకు ఏదో ప్రయోజనం కల్పించామన్న భావన కోసం, తమను నాయకుడిగా గుర్తించేందుకు వారికి డబ్బు, బహుమతులు ఇస్తుంటారని వివరించింది. 

.. అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, కొన్నిసార్లు నేరుగానే డబ్బు సాయం చేయడం వంటివీ ఇందుకే.. ఇక ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉండేవారు తక్కువే. కానీ ఆ కొద్దిశాతం ఓట్లతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితులు ఎక్కువ. ఇక్కడే ‘పంపకాల’ ప్రయోజనం మరింత ఎక్కువన్నమాట.  

ప్రలోభాలకు లొంగవద్దనే ప్రచారాలతో ప్రయోజనమెంత? 
డబ్బు తీసుకుని ఓటేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇందులో ఓటేసేందుకు ఎలాంటి డబ్బు, బహుమతులు తీసుకోవద్దనేది ఒకటైతే.. డబ్బు తీసుకోండి, కానీ మీకు నచ్చినవారికే ఓటేయండి అన్నది రెండో రకం ప్రచారం. నిజానికి రెండో రకం ప్రచారం వల్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నా.. తమకు నచ్చిన, సమర్థుడైన నేతకే ఓటేస్తారన్న అభిప్రాయం ఉంటుంది.

కానీ ఇది తప్పు అని అధ్యయనం తేల్చింది. ఏమీ తీసుకోవద్దు, ఓటును అమ్ముకోవద్దన్న ప్రచారంతోనే కొంత ప్రయోజనం ఉంటోందని పేర్కొంది. ఏమీ తీసుకోనివారిలో ఎలాంటి బెరుకు ఉండదని, నచ్చినవారికి ఓటేస్తారని తెలిపింది. అయితే పంచే డబ్బు/బహుమతి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఓటర్లు తీసుకోకుండా ఉండలేకపోతున్నారని స్పష్టం చేసింది.

ఇక.. ‘డబ్బు తీసుకోండి. నచ్చినవారికే ఓటేయండి’ అన్న ప్రచారం.. ఓట్ల కొనుగోలు, ప్రలోభాలను మరింతగా పెంచుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లు డబ్బు/బహుమతులు తీసుకోవడంలో మొహమాటాన్ని పక్కన పెట్టేస్తున్నారని, ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నించే నేతలకు పని సులువు అవుతోందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాక.. ‘డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేయకపోతే ఎలా..?’ అన్న మీ మాంసతో డబ్బులిచ్చిన అభ్యర్థికే ఓటేస్తున్నారని తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement