ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్లు మార్పు
అన్ని రాజకీయాల పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం
కృష్ణునిపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో కొత్త ఓట్లు నమోదు
వాస్తవ విరుద్ధంగా ‘ఈనాడు’ కథనం
రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్‌అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు.
అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే..
కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు.
నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్‌కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు.
ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో
తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు..
కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్‌అండ్ ఆర్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment