మళ్లీ సిండికేట్లు
మద్యం అమ్మకాల్లో బార్ కోడింగ్ అమలు చేయని వ్యాపారులు
⇒ ఎమ్మార్పీ నిబంధన యథేచ్ఛగా ఉల్లంఘన
⇒ బార్లు, పర్మిట్ రూంలలో నిఘా లోపం
⇒ ‘నాన్ డ్యూటీ పెయిడ్’పై నియంత్రణేదీ?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 199 మద్యం దుకాణాలు, తొమ్మిది బార్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ యేడాది జూన్‌లో ప్రవేశ పెట్టిన 2014-15 నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం వైన్, బార్‌షాపులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) సీసాలపై బార్ కోడ్ ముద్రించి అమ్మకాలు జరపాలని ఎక్సైజ్ పాలసీలో పేర్కొన్నారు.
జూలై ఒకటో తేదీ నుంచి బార్‌కోడ్ విధానం అమలు కావాల్సి ఉండగా బార్‌షాప్ యజమానులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. తమకు కేటాయించింది శాశ్వత లెసైన్స్ కానందున ఇప్పట్లో అమలు చేయబోమంటూ కొందరు కోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం. బార్ కోడ్ విధానంపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇదే అదనుగా కొందరు వైన్‌షాపుల యజమానులు నిర్దేశిత ధరలకు కాకుండా అమ్మకాలపై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
బ్రాండ్‌ను బట్టి, పరిమాణాన్ని బట్టి ఒక్కో సీసాపై రూ.15 నుంచి రూ.75 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐదువేల జనాభాకు పైబడిన ప్రాంతాల్లో 175 వైన్‌షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంలను కూడా మంజూరు చేశారు. పర్మిట్ రూంల మంజూరుకు ఎక్సైజ్ విభాగం అదనంగా లెసైన్సు ఫీజు వసూలు చేసింది. పర్మిట్ రూంలలో విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నియంత్రణ లేకపోవడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది.
విక్రయాలపై ఏదీ ‘నిఘా’
సరిహద్దునే ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం దిగుమతి అవుతున్నా ఎక్సైజ్ విభాగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. సాధారణ ఎన్నికల సమయంలో నాన్ డ్యూటీ పెయిడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ తర్వాత ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలా కనిపించడం లేదు. కర్ణాటకలో చీప్ లిక్కర్ ధర స్థానిక ధరలతో పోల్చి చూస్తే రూ.15 మేర తక్కువగా ఉంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని వైన్ షాపులు గుర్మిట్‌కల్ తదితర ప్రాంతాల నుంచి చీప్ లిక్కర్‌ను తరలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అసాంఘిక శక్తులు, అతిగా మద్యం సేవించి పబ్లిక్‌గా న్యూసెన్స్ సృష్టించే వారిపై నిఘా వేసేందుకు మద్యం షాపులు, పర్మిట్‌రూంలు, బార్ అండ్ రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెద్ద పట్టణాల్లో మినహా ఎక్కడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దాఖలా కనిపించడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులతో కొంతకాలం సద్దుమణిగిన మద్యం మాఫియా కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
లక్షల కొద్దీ లీటర్ల వాష్ (సారా తయారీ పానకం) ధ్వంసం చేసినట్లు ప్రకటిస్తున్నా ఏరులై పారుతోంది. ఎక్సైజ్, పోలీసు విభాగాలకు క్రమం తప్పకుండా మామూళ్లు అందుతుండటం వల్లే మద్యం ధరలు అదుపు తప్పడం, కల్తీ, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అమ్మకాలు పెరిగేందుకు దోహద పడుతున్నట్లు తెలుస్తోంది.
విక్రయాలు రూ.700 కోట్లుపైనే!
జిల్లాలో 199 వైన్ షాపులు, తొమ్మిది బార్ షాపులు నిర్వహిస్తుండగా, 175 వైన్‌షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంలకు అనుమతి మంజూరు చేశారు. జిల్లాలో సగటున ప్రతి నెలా రూ.50 కోట్లు నుంచి రూ.60 కోట్లు మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. యేడాదిలో మద్యం విక్రయాలు రూ.700 కోట్లకు పైబడే జరుగుతున్నాయి. దసరా, సంక్రాంతి ఇతర ప్రత్యేక సందర్భాల్లో పదిశాతం మేర అదనంగా మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.