
సాక్షి, కల్వకుర్తి రూరల్ : సచ్ఛీలురైన నేత ప్రజాప్రతినిధిగా ఎంపికైతే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లుతుందనేది సత్యం. ఈ విషయాన్ని గుర్తించి నేర చరిత్ర ఉన్న నేతలు ప్రజా ప్రతినిధులుగా ఎంపిక కాకుండా చూడడం ప్రజల చేతుల్లోనే ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం దీనిపై ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థులు తమ నేరచరిత్ర ప్రజలకు తెలిసేలా వెల్లడించేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రస్తుతం రాష్త్రంలో జరుగుతున్న ఎన్నికల్లో దీన్ని తప్పనిసరి చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
మార్పునకు సంకేతం
ఎన్నికల ప్రక్రియలోనూ మార్పులు వస్తుండడం ఆహ్వానించదగిన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. అభ్యర్థుల గురించి సమగ్రంగా తెలియకుండా ఓటు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. అలా కాకుండా పోటీ చేస్తున్న వారెవరు, వారి వైఖరి, నేరచరిత్ర ఉందా అనే విషయాలు సుప్రీం కోర్టు ఆదేశాలతో బయటకు రానుండడపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పారదర్శకతకు పెద్దపీట
అభ్యర్థులు వారి నేరచరిత్రకు సంబం«ధించిన వివరాలను ఏదేని మూడు మాధ్యమాల ద్వారానైనా ప్రచురించాలి. ఎంసీఎంసీ కమిటీ అనుమతితో ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోనూ ఏడు సెకన్ల పాటు ప్రసారం చేయాలి. ఈ వ్యయాన్ని ఎన్నికల ఖర్చుగానే పరిగణనలోకి తీసుకుంటారు. మూడింటిలోనూ రెండు ప్రధాన పత్రికలు, చానల్ ఉంటుంది. దీంతో అభ్యర్థుల నేర చరిత్ర ప్రజలకు తెలియడంతో పాటు ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది.
గతం నుంచే ఉన్నా...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్‌లో నేర చరిత్ర వివరించాలనే నిబంధన ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది అమలయ్యేది కాదు. దీంతో సుప్రీంకోర్టు ఇక నుంచి జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వతహాగా నేర చరిత్ర వెల్లడించేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది.
ఈ మేరకు స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అభ్యర్థిపై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నవి, శిక్ష పడినవి తదితర వివరాలను ప్రత్యేక పత్రం ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించాలని నిర్ణయించారు. దీని కోసం వచ్చే 4వ తేదీ వరకు గడువు ఉంది. అంతేకాకుండా అభ్యర్థులు తమ నేర చరిత్ర వివరాలను పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రకటనలు కూడా ఇవ్వాలని ఆదేశించింది.