‘ఆరోగ్యలక్ష్మి’లో అన్నీ అవకతవకలే..
- రాష్ట్రంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో మొదట గుర్తింపు
- గత జూలైలో రాష్ట్ర విజిలెన్స్ విభాగం తనిఖీలో బహిర్గతం
- అర్హులకే నేరుగా నగదు బదిలీ చేసేందుకు నిర్ణయం
- ఇక ఏటా రూ. 31.24 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకే..
సాక్షి, నిర్మల్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నగదు బదిలీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం గమనా ర్హం. మహిళ, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన గర్భిణులు, బాలింతల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి దానికయ్యే ఖర్చును వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. అంగన్‌వాడీల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో తొలి విడత దీన్ని నగదు బదిలీ కిందకు మార్చనున్నారు. ఇలా చేయడం వల్ల పౌష్టికాహారంలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడంతోపాటు అర్హులకు నేరుగా లబ్ధి కలుగుతుందని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.
అవకతవకలు మొదట ఆదిలాబాద్‌లోనే..
ఆరోగ్యలక్ష్మి పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో మొదట పాత ఆదిలాబాద్ జిల్లాలోనే రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. గత జూలై 22, 23 తేదీల్లో పాత ఆదిలాబాద్ జిల్లాలోని అర్బన్ ప్రాజెక్టులు మినహా 15 రూరల్ ప్రాజెక్టులలో ఆరు విజిలెన్స్ బృందాలు తనిఖీ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ తనిఖీల్లో ఆరోగ్యలక్ష్మిలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ బృందానికి తేటతెల్లమైంది. పలుచోట్ల లబ్ధిదారుల హాజరు, పౌష్టికాహారం పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. వాస్తవంగా గర్భిణులు, బాలింతలు ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రానికి రావడాన్ని కష్టంగా భావిస్తున్నారు. చాలాచోట్ల దొడ్డుబియ్యంతో వండిన భోజనాన్ని నిరాకరిస్తున్నారు. వండిన పదార్థం కాకుండా ముడి సరుకు ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని అప్పట్లో స్పష్టమైంది. సరుకులు దారి తప్పుతున్నాయని విజిలెన్స్ బృందం తనిఖీలో వెల్లడైంది. ఆదిలాబాద్‌లో భారీ అవకతవకలు బయటపడడంతో మిగతా జిల్లాల్లోనూ ఈ తనిఖీలు చేయాలని ప్రభుత్వం యోచించింది. ఆ తరువాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇలాంటి త నిఖీలు చేపట్టి అవకతవకలను గుర్తించింది.
అప్పట్లో సస్పెన్షన్‌లు, చార్జ్ మెమోలు..
ఆరోగ్యలక్ష్మి అవకతవకలు విజిలెన్స్ తనిఖీలో వెల్లడి కావడంతో ఆ బృందం రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక అందజేసిన పది రోజుల్లోనే పలువురు అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 3వ తేదీన జైనూర్ సీడీపీవో శ్రీదేవి, లక్సెట్టిపేట జూనియర్ అసిస్టెంట్ శారద, తలమడుగు సూపర్‌వైజర్ మమత, చెన్నూర్ కిష్టంపేట సెక్టార్ సూపర్‌వైజర్ ఉమాదేవి, వాంకిడి జూనియర్ అసిస్టెంట్ సలీం పాషాలను సస్పెండ్ చేశారు. మరో 39 మంది ఉద్యోగులకు చార్జ్ మెమోలిచ్చారు. అందులో 12 మంది సీడీపీవోలు ఉండడం గమనార్హం. చార్జ్ మెమో అందుకున్న సీడీపీవోల్లో బోథ్ సీడీపీవో జ్యోతి వ్యత్యాసాలను సరిచూపకపోవడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. మిగతా సూపర్‌వైజర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఉద్యోగులు నెలరోజుల్లో ప్రభుత్వానికి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం తరువాత సద్దుమణిగింది. మెమోలు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోలేదు. కాగా.. ఇటీవల సస్పెన్షన్ వేటుకు గురైన ఉద్యోగులు దాన్ని ఎత్తివేయాలని ముఖ్య నేతలను ఆశ్రయించినట్లు విమర్శలు వచ్చాయి.
ఇదీ పరిస్థితి..
పాత ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్యలక్ష్మి ద్వారా 41 వేల 326 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరుతుంది. జిల్లాలోని 18 ప్రాజెక్టుల పరిధిలో 4 వేల 124 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుకు రోజూ ఒకపూట పప్పు భోజ నం, 200 మిల్లీ లీటర్ల పాలు, గుడ్డు అం దిస్తారు. నిత్యం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే లబ్ధిదారు పౌష్టికాహారం కోసం ప్రతీపూట రూ.21 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఏటా రూ.31.24 కోట్లు వెచ్చిస్తోంది. ఆరోగ్యలక్ష్మి పథకంలో అన్నీ అవకతవకలే జరగడంతో ఇక రానున్న రోజుల్లో ఈ రూ.31.24 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ కానున్నాయి.